ఆదిలాబాద్ జిల్లా చరిత్ర
ఒకప్పుడు ఈ జిల్లాను పాలించిన బీజాపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద ఆదిలాబాద్ అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. తన వద్ద పనిచేసే ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి అదిల్ షాహ్ ఈ ప్రాంతాన్ని అతనికి జాగీరుగా బహూకరించాడు. ఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేయగా, రానురాను అదే ఆదిలాబాదుగా మారినట్లు ప్రచారం.
మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని అందుకే ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది కాస్తా ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. ఈ జిల్లాకు ఉత్తరాన మహారాష్ట్రంలోని యవత్మాల్, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పు వైపున కూడా చంద్రాపూర్ జిల్లా విస్తరించి ఉంది, దక్షిణాన నిజామాబాద్, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం ‘సుమారు16203 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. ఆదిలాబాద్ జిల్లా 70 శాతం భూభాగం ఉష్ణమండల తేమతో కూడిన అడవులతో విస్తరించి ఉంది. ఇది తెలంగాణలోని అటవీ ప్రాంతం కలిగిన రెండో జిల్లా కావడం గమనార్హం. వైశాల్యం పరంగా రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉంది.ఈ జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 675 మిలియన్ టన్నుల నాణ్యమైన సున్నపురాయి నిల్వలు ఈ జిల్లా ఉన్నాయి. దక్షిణాన గోదావరి నది, తూర్పున ప్రాణహిత , ఉత్తరంలో వార్ధా నదులు ఉన్నాయి. జిల్లా జనాభా సుమారు 30 లక్షల వరకు ఉంటుంది.
సంస్కృతి
ఆదిలాబాద్ జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణాదిలోని పలు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఉత్తరభారత దేశం నుంచి ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారత దేశం నుంచి శాతవాహనులు, చాళుక్యులు ఈ ప్రాంతాన్నిపాలించారు. ప్రస్తుతం ఈ జిల్లాలో పొరుగున ఉన్న మరాఠీ సంప్రదాయంతో పాటు , తెలుగు సంప్రదాయంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మలయాళీ, గుజరాతీలు జీవనం సాగిస్తున్నారు. సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళూ, చెక్కిన రాళ్ళు, ఇంకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల్ బొమ్మలు ప్రసిద్ధి గాంచినవి. ఇక జిల్లాలో అట్టహాసంగా జరిగే “నాగోబా” గిరిజన ఉత్సవాలు చెప్పుకోదగ్గవి.
ప్రధాన పంటలు
జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంటలు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం కావడంతో రైతులు వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు, సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో పట్టుపురుగుల పెంపకం కూడా జరుగుతోంది. పట్టుపురుగుల పెంపకం కొరకు ‘సుమారు వెయ్యి ఎకరాలలో మలబరీ చెట్లు పెంచారు. జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వల్ల కూడా రైతులు, యువతకు ఆదాయం, ఉపాధి లభిస్తోంది. ఎక్కువ శాతం అటవీ ప్రాంతం కావడంతో జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకానికి అనువుగా ఉంది. జిల్లాలో 80కి పైగా పశువుల దావాఖానాలు ఉన్నాయి. జిల్లాలో ఉద్యానవన సాగుబడి వల్ల కుడా విదేశీమారకం రూపంలో ఆదాయం సమకూరుతున్నది.
విభజన తర్వాత…
ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా అదిలాబాద్ జిల్లా పరిధిలో 52 మండలాలు ఉన్నాయి. జిల్లా పునర్య్వస్థీకరణ తరువాత ఆదిలాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడ్డాయి, 18 రెవెన్యూ మండలాలు, 508 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 31 గ్రామాలు ,5 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 467 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణకు ముందు జిల్లా పరిధిలోని ఆదిలాబాదు, మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్ ఏడు పురపాలక సంఘాలు ఉండేవి.
కొత్త జిల్లాలు
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం , పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా అదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 52 పాత మండలాల నుండి 14 మండలాలుతో మంచిర్యాల జిల్లా, 13 మండలాలుతో నిర్మల్ జిల్లా, 12 మండలాలుతో కొమరంభీమ్ జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి.