తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు, అధికార పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల ఎత్తుగడల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం అధికమవుతోంది. ఒకవైపు కుల రహిత సమాజం కావాలంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేసే నేతలే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కులాలను ఎన్నికల తెరపైకి తేవడం సామజిక, రాజకీయ పరిశీలకులను నివ్వెర పరుస్తోంది. బి.అర్.ఎస్., కాంగ్రెస్, బిజెపి ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు గతంలో మాదిరిగా సాధారణ సభలు,సమావేశాల కంటే ప్రస్తుతం కుల, మత సదస్సులు, సమ్మేళనాలు, భేరీలు చేపట్టడం విచిత్రంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

కుల పరమైన సమావేశాలు ముమ్మరంగా నిర్వహించడంలో ఒక విధంగా బి.అర్.ఎస్. దూసుకు పోతుంది. ఎన్నికల ప్రక్రియ మొదలు కావడానికి రెండు, మూడు నెలల ముందు నుంచే “ఆత్మీయ సమ్మేళనాలు” పేరుతో కుల పరమైన జన సేకరణ చేపట్టింది. కమ్మ, కాపు, గౌడ, బ్రాహ్మణ, లంబాడా,కురుమ,యాదవ, రజక,విశ్వకర్మ, పద్మశాలి ఇలా కులాల కులం పేరుతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అధికార బి.అర్.ఎస్. పార్టీ పెద్ద ఎత్తున హామీలు, వరాలు వెద జల్లడం మొదలు పెట్టింది. కుల సంఘాల భవనలకు స్థలాలు కేటాయించడం, నిధులు మంజూరు చేయడంతో పాటు నిర్మాణం పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు చేయడం ఈ మధ్య అధికమైందని పరిశీలకులు భావిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ సైతం ఎన్నికల సమయంలో మాదిగలను భారీ సంఖ్యలో తరలించి విశ్వ రూప మహాసభ నిర్వహించడం, దానికి సాక్షాత్తూ ప్రధాన మంత్రి హాజరు కావడం రాజకీయ విశ్లేషకులను ఆలోచనల్లో పడేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా బి.సి. జనగణన పై దృష్టి సారించి దాన్నే విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం కూడా కులాల ఓటు బ్యాంకు కోసమేనని స్ఫష్టం అవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. కులాల వారీగా ఇంత బాహాటంగా సమావేశాలు నిర్వహించడం ఈ ఎన్నికల్లోనే కనిపిస్తోందని పేర్కొంటున్నారు. గతంలో కేవలం బి.సి., ఓబిసి, ఎస్.సి,ల వర్గీకరణ వంటి సామాజిక అంశాలు మాత్రమె ఎన్నికల్లో కనిపించేవని, ఇప్పుడు కులాల వారీగా విడివిడి సమావేశాలు ఏర్పాటు చేయడం భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమనే అభిప్రయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఒక కులానికి చెందిన వారిని ఆహ్వానించి దానికి ఏదో ఒక “టాగ్ లైన్”(ఉప శర్షిక) చేర్చి సభలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం అని మేధావి వర్గంలో ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు కుల రహిత సమాజం కావాలంటున్న అనేక మంది నేతలే ఇప్పుడు పోటీ పడి మరీ కుల సంఘాలతో కలిసి సమావేశం కావడం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పోకడ ఇక్కడికి దారి తీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుల వివక్ష పోవాలనే ఆలోచనలకు ఈ తరహా ధోరణి గొడ్డలి పెట్టులాంటిదని హెచ్చరిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలు బలోపేతం కావాలంటే ముందు ఆ వర్గాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇటువంటి కులాల వారీ సమావేశాల ప్రభావం ఈ తరం యువతపై పడితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. కేవలం ఎన్నికలు, ఓట్ల కోసం కులాలను వాడుకోవడం సమంజసం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.