అటు“బెయిల్”బలం – ఇటు అసహనం…!

jagan babu.jpg c

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు కావడం అక్కడి ప్రధాన ప్రత్యర్ధి వైసిపి నేతలకు మింగుడు పడడం లేదా? బాబు అరెస్టుకు అనేక ఆధారాలు ఉన్నాయంటున్న అధికార పార్టీ నేతలు, కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు కోర్టు విశ్వాసాన్ని కోల్పోయారా? ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో పోలీసు అధికారులు, విచారణ సంస్థ విఫలమైందా? బాబుకు బెయిల్ రావడంతో వైసిపి నేతల్లో అసహనం ఎందుకు పెరిగింది? తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సోమవారం ఇలాంటి ప్రశ్నలు అనేకం తలెత్తాయి. దీనికి కారణాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. నిన్నటి వరకు మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ హై కోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనర్హం. పోలీసులు చెప్పినట్టు స్కిల్ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారని, కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదని బెయిల్ మంజూరు సమయంలో  హైకోర్టు పేర్కొంది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో, ఎన్ఎస్‌జీ భద్రత మధ్య ఉన్నారని, కేసు విచారణ నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదని అంతేకాక, కేసు విచారణకు అయన విఘాతం కలిగించే అవకాశం కూడా లేదని అభిప్రాయ పడింది. అదేవిధంగా సీమెన్స్ డైరెక్టర్, డిజైన్ టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించడం, సీమెన్స్ తో ఒప్పందంలో సుమన్ బోస్ పేరుతో సంతకం ఉందని ప్రాసిక్యూషన్ వాదనలో సంతకాలు పరిశీలించే బాధ్యత సీఎంది కాదని, సంతకంపై అభ్యంతరాలుంటే ఫోరెన్సిక్ విభాగం తేలుస్తుందని వ్యాఖ్యానించడం బెయిల్ మంజూరు అనంతరం విస్తృత చర్చలకు దారి తీసింది. కోర్టు అనేక విషయాలను పరిశీలించి బాబుకి బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే వైసిపి, తెలుగుదేశం నేతలు పోటీ పడి వాదనలకు దిగారు.

sajjal

అధికార వైసిపికి చెందినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించిన తీరు రాజకీయ పరిశీలకులను విస్మయ పరిచింది.చంద్రబాబుకు గుండె నొప్పి ఉంటే విజయ యాత్ర ఎలా చేస్తాడని, చంద్రబాబు లోపలున్నా, బయట ఉన్నా ఒకటే అంటూ ఈ స్కాం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అనడానికి అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని, టెక్నికల్, హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ పొందాడని, తనకున్న విచక్షణతో న్యాయమూర్తి ఇచ్చిన బెయిల్‌ ఇచ్చారని కూడా సజ్జల చెప్పుకు రావడం కొత్త రకం చర్చకు తెర లేపింది. సజ్జల వ్యాఖ్యలను  తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఘాటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

lokesh1

చంద్రబాబుని అరెస్టు చేసి 50 రోజుల‌కి పైగా జైలులో పెట్టి క‌నీసం ఒక్క ఆధార‌మూ కోర్టు ముందు ఉంచ‌లేక‌ పోవడంతో జగన్ రెడ్డి కుట్ర‌లు న్యాయం ముందు బ‌ద్ద‌ల‌య్యాయని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్రభుత్వం పై విరుసుకు పడ్డారు. కేసులో ఆరోపించిన‌ట్టు షెల్ కంపెనీలు లేవ‌ని తేలిపోయిందని, తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు ప‌డ్డాయ‌నేది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూట‌క‌మ‌ని స్ప‌ష్ట‌మైందని పేర్కొన్నారు. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్ర‌బాబు 45 ఏళ్ల  పొలిటిక‌ల్ ఇమేజ్ దెబ్బ తీయడానికి  జ‌గ‌న్ అండ్ కో  ప‌న్నాగం దేశ‌ మొత్తానికి  తెలిసిందని లోకేష్ వ్యాఖ్యానించారు.

achana

జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటని, అక్రమ కేసులు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని,  జగన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడేందుకు  చంద్రబాబు  త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి వస్తారని టిడిపి  ఆంధ్రప్రదేస్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

పయ్యావుల కేశవ్, గద్దె రామమోహనరావు వంటి టిడిపి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వం పై విరుసుకు పడ్డారు. సోమవారం మధ్యాహ్నం నుంచి మొదలైన వైసిపి, తెలుగుదేశం నేతల ప్రకటనల హోరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చింది. తెలంగాణలో ఎన్నికల వేడి అధికం కావడం ఇదే సమయంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయిందనే విషయం తెలియడంతో తెలంగాణ లోను టిడిపి శ్రేణుల్లో సందడి కనిపించింది.పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టిఆర్ భావనకు చేరుకొని సంబరాలు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం బాబుకు స్కిల్ కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ అయన పై ఉన్న మిగతా కేసుల వ్యవహారంలో ప్రభుత్వ, పోలిసుల వైఖరి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *