“కారు”కలలు…!

landcruser

గత పదేళ్లుగా కుటుంబం పోగేసుకున్న ఆస్తులను చూస్తూ మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ప్రజలు ముడోసారి కూడా తమనే గద్దెనెక్కిస్తారనే అత్యాశ బిఆర్ఎస్ అధినేతల్లో గట్టిగా ఉన్నట్టు తేలిపోయింది. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయిస్తూ, సమర్ధవంతులైన అధికారగణం చుట్టూ ఉన్నా ఎన్నికల పలితాల తీరు తెన్నులను ముందుగానే అంచనా వేయలేక పోవడం “ఒంటెద్దు” ప్రభుత్వ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలోనైనా కనీసం ఇంటలిజెన్స్ అధికారుల మాటలు వింటే బాగుండేదనే వాదనలు ఆ పార్టీ వర్గాల నుంచి ఇప్పుడు బయటకు పోక్కుతున్నాయి. ఏ నాయకుని మాటలు గానీ, అధికారుల సూచనలు గానీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టేది. దీంతో “సారు” ఆదేశాలే అందరికీ శిరోధార్యం. అందుకే మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే ఖరీదైన కాన్వాయిలో కాలు పెట్టాలనుకున్నారో లేక “చిన్నసారు”ని సర్ప్రైజ్ చేయాలని భ్రమ పడ్డారో తెలియదు గానీ గుట్టుచప్పుడు కాకుండా  ఏకంగా 22 ల్యాండ్ క్రుజర్ కార్లను సిద్ధం చేయించారు. బిఆర్ఎస్ నేతలు దుమ్మెత్తి పోసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్లకు ముస్తాబు చేయించడం గమనార్హం. నిన్న సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వాహనాల విషయాన్ని చెప్పే వరకు ఎవరికీ తెలియదు. కన్వాయి వాహనాలను విజయవాడలో సిద్ధం చేస్తున్నవిషయం కనీసం పోలీసు శాఖలోని ప్రోటోకాల్ అధికారులకు గాని, పోలీస్ ట్రాన్స్ పోర్ట్ సంస్థ (పిటిఓ) వర్గాలకు గాని తెలుసా లేదా అనే అనుమానం కలుగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని  వీరపనేనివారి గూడెం మిల్లర్ త్రివేణి అనే సంస్థలో ఈ వాహనాలు ఉన్నట్టు తెలుస్తోంది. 22 వాహనాలను ఆధునీకరించడానికి సుమారు 66 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు ఇప్పటి వరకు అందిన సమాచారం. ఒక్కొక్క వాహనాన్ని బులెట్ ప్రూఫ్ గా మార్చి , ఇతర సదుపాయాలు కల్పించడానికి దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా చెల్లించినట్టు తెలుస్తోంది, ఒక అధికారి ఈ విషయాలను తనకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ప్రతీ విషయానికి క్షణాల్లో మీడియా ముందుకు వచ్చే కెసిఆర్, కేటిఅర్,కవిత వంటి బిఆర్ఎస్ పార్టీ నేతలు ఈ వ్యవహారం పై ఇప్పటి వరకు స్పందించక పోవడం గమనార్హం. వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందా అని అటు అధికారులు, ఇటు బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *