దేశంలో నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కు గడువు తేదీ అయిపోయిందని, మోడీ మెడిసిన్ ఇక పని చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో రేవంత్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారనీ. ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోకసభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
డబుల్ ఇంజిన్ అంటే ఆదానీ, ప్రధాని మాత్రమే అని, లోకసభలో రాహుల్ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ అనే ఇంజిన్ షెడ్ కు పోయిందని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజిన్ కూడా పని చేయదన్నారు.రాహుల్ గాంధీ ఈ సారి మణిపూర్ నుంచి ముంబై వరకు చేపడుతున్న భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజిన్ కూడా పని చేయదన్నారు. మోడీ జీ మీరు ఒక సామాన్య వ్యక్తి ని పార్లమెంట్ లో రాకుండా ఆపలేకపోయారు. రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపడం కూడా మీతరం కాదని రేవంత్ సవాలు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టే భారత్ న్యాయ్ యాత్రతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 150 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర చేసిన భారత్ జోడో యాత్రతో మొదట కర్ణాటకలో తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని,ఈ సారి రాహుల్ యాత్ర వల్ల మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాబోయే 100 రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు చాలా కీలకమని, ఈ వంద రోజులు దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కేటాయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడాలని రేవంత్ రెడ్డి కోరారు.