"తూచ్ తొండి"అంటే కష్టం.. - EAGLE NEWS

“తూచ్ తొండి”అంటే కష్టం..

IMG 20240223 WA0092

ప్రజాస్వామ్యంలో సామన్యులైనా, బాధ్యత గల స్థానంలో ఉన్న వారెవరైనా సరే కోర్టులు, విచారణ సంస్థల ఆదేశాలకు తల వంచాల్సిందే. ఆరోపణల పై అధికారుల సందేహాలను నివృత్తి చేయాల్సిందే. చట్ట బద్ధంగా వ్యవహరించే అధికార యంత్రాంగానికి సహకరించాలి. సహకరించి తీరాలి. అంతేగానీ, అక్రమ అరెస్టు అనీ, వేధింపులు అంటూ రచ్చ చేయాలని ప్రయత్నించడం సబబు కాదు. లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉందంటూ తలా,నోరు బాదుకొని చివరికి కట్టుదిట్టమైన ఆధారాలతో కవితను అరెస్టు చేసిన వాస్తవం తెలిసి కూడా కెటిఆర్ వంటి నేతలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం సామాన్యులకు సైతం అంతుపట్టడం లేదు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఇంకా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న ఆలోచనలే అమలు చేయాలనుకోవడం భారాస నేతల ఒంటెత్తు పోకడలకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తోంది. కవిత అరెస్టుని అడ్డుకోవడానికి ఏడాది కాలంగా భారాస ఎన్ని ఎత్తుగడలు వేసిందో తెలియని విషయం కాదు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిని రాజ్యాంగ బద్ధమైన విచారణ సంస్థలు పిలిపించి విచారించే ఆనవాయితీ ఉండేది.కానీ, తనను ఇంట్లోనే విచారించాలని ఇన్ని కవిత చేసిన విన్నపాన్ని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. కానీ, ఆ వ్యవహారం కోర్టులో వుండగానే కవిత వ్యవహార శైలి మారడం ఆశ్చర్యం కలిగించింది. ఢిల్లీ లిక్కర్ వివాదం ఒక చిన్న విషయం అని, దాన్ని ఆమె న్యాయవాదులు చూసుకుంటున్నారని బహిరంగంగా చెప్పాడం సమస్యకు దారి తీసినట్టు కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వేస్తే మొన్న కవితని కేంద్ర అధికారులు అరెస్టు చేసినప్పుడు భారాస కార్య నిర్వాహక అద్యక్షుడు కెటిఆర్ చేసిన వీరంగం తెలంగాణ సమాజాన్ని విస్తుపోయేల చేసింది. చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న అధికారుల పై ఆయన విరుసుకు పడ్డ తీరు అంతుపట్టని వ్యవహారం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సాక్షాత్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సంవత్సర కాలంగా జైలులోవుంటున్న విషయం, ఆ కేసులో కవిత ప్రమేయం ఉందన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న వాదనలు, సి.బి.ఐ. చేసిన విచారణలు మరచిపోయి ఆమె అరెస్టును మాత్రమే భూతద్దంలో చూపే ప్రయత్నం చేసి చివరకు విఫలం కావడం భారాస శ్రేణులకు సైతం అంతుపట్టని విషయం. పదేళ్ళ పాలనలో బయట పడ్డ కాళేశ్వరం కుంగుబాటు, ఫార్ములా ఇ, ధరణి లోపాలు, టి ఎస్.పి.ఎస్. అక్రమాలు, దొంగ పోలీసుల ఆగడాలు వంటి అనేక అంశాల నుంచి ప్రజలను పక్క దోవ పట్టించడానికి భారాస నేతలు చేస్తున్న ప్రయత్నాలకు కవిత అవినీతి భాగోతం అడ్డుగా మారింది. అందుకే అనుకుంటా ఉద్యమ నేత, సొంత తండ్రి చంద్ర శేఖర్ రావు కూడా ఆమె అరెస్టు పై పెదవి విప్పలేదు. ప్రతీ విషయంలో తెలంగాణ నైజాన్ని చాటుకునే కేసీఆర్ కన్న కూతురు అరెస్టు విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నరో తెలియాల్సిన సమయం.రాష్ర్టంలో అధికారాన్ని కోల్పోయిన భారాస నేతలు అధికార పార్టీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం, చివరకు మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కవితని కూడా వెనుకేసుకొని రావడానికి ప్రయత్నిస్తూ అవన్నీ కేంద్ర,రాష్ట్రాల ఎత్తుగడలు అంటూ ప్రచారం చేసే వ్యూహాలు రచించడం రాజకీయ పరిశీలకులను సైతం నివ్వెర పరుస్తోంది. తమ పార్టీ నేతల పై వస్తున్న ఆరోపణలను చిన్న పిల్లల మాదిరిగా “తూచ్ అన్నీ అబద్ధాలే” అంటూ కొట్టి పారేసే బింకాలకు పోవడం తెలంగాణలో మెజారిటీ జనానికి నచ్చడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *