ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఎన్ని హామీలైనా గుప్పించవచ్చు. ప్రత్యర్థి పార్టీ పై రాజకీయ విమర్శలూ చేయొచ్చు. కొన్నేళ్ల కిందట వరకు ఎన్నికల తెరపై ఇదే తంతు కనిపించేది. రానురానూ అది కాస్తా వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళింది. దశాబ్ద కాలంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజా సమస్యల ముచ్చట పక్కనపెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సర్వ సాధారణమైంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీనీ, దాని నాయకులను ఓడిన నేతలు శత్రువులుగా చూడడం పరిపాటైంది. అధికార దాహం మితిమీరడం వల్ల చివరకు ప్రజాస్వామ్య బద్ధంగా ఏలిక పగ్గాలు చేపట్టిన ప్రభుత్వాన్ని కూలదోస్తామనే నీచమైన బెదిరింపులకు పాల్పడే దుస్థితి చోటుచేసుకుంది.
భారాస “కుట్ర” వ్యూహం…!
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి వ్యవహరిస్తున్న తీరు ఇందుకు తాజా ఉదాహరణగా కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం భారాస అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. పూర్తీ స్థాయి బలంతో రేవంత్ రెడ్డి నాయత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలుస్తామని, అది కూలిపోతుందని కేసీఅర్,కెటిఆర్, హరీష్, శ్రీహరి లాంటి పలువురు బహిరంగ ప్రకటనలు చేయడం వల్ల నిజానికి అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ప్రజలు చేసిన తప్పుగా నిందలు వేయడం, ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంపై భారాస శ్రేణులను రెచ్చగొట్టే రీతిలో కేటీఆర్ మాట్లాడడం అంతుపట్టని విషయం. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యం. అయితే, ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచనలు కుట్ర పూరిత నేరాలోచన పరిధిలోకి వస్తాయని కొందరు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. పదేపదే ఇలాంటి ప్రకటనలు చేస్తే బెదిరింపుల కింద ప్రభుత్వమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, భారాసకు చెందిన ఎం.పి. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి నేతలు కాంగ్రెస్ గడప తొక్కి కండువా కప్పుకోవడం గులాబీ దళపతులకు మింగుడు పడటం లేదు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు నకు పాల్పడ్డారంటూ భారాస తలానోరు బాదుకోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పదేళ్ల కిందట తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పేరుపై గెలిచిన సుమారు 39 మంది ఎమ్మెల్యేలను ఏలాంటి ఎత్తుగడలతో అప్పటి టీఆర్ఎస్ లోకలుపుకున్నారనే వాదన తలెత్తుతోంది. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యే లను భారాస తన గంపలో వేసుకుంది. ఇందులో టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్పి నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక్కరు ఉన్నారు. అదేవిధంగా 2018 లో వివిధ పార్టీలకు చెందిన 16 మందిని చేర్చుకోగా వారిలో కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉండడం గమనార్హం.
అప్పట్లో కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టిన విషయం మరచిపోయారా అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే తలసాని, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకొని వారు అయా పార్టీలకు రాజీనామా చేయకముందే మంత్రివర్గంలోకి తీసుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. భారాస గతంలో చేసిన ఘోరమైన తప్పిదాలను మరచిపోయి ఇప్పుడు పూర్తీ స్థాయి సంఖ్యా బలం ఉన్న ప్రభుత్వాన్ని కలుస్తామనే కుట్రకు పూనుకోవడం మూలంగానే కావొచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కాదు….పిసిసి అధ్యక్షుడిగా రాజకీయ “పని” మొదలు పెడతా అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఒక్క గేటు తేరిస్తేనే ఇద్దరు సిట్టింగులు వచ్చి చేరారు… దీంతో ఆయన ఇంకా ఎన్ని ద్వారాలు ఎలా తెరుస్తారనేది జనంలో ఆసక్తికర చర్చ తలెత్తింది. అయితే, ఎన్నికల సమయంలో నేతలు గోడ దూకడం మాత్రం భారాసకు తలనొప్పిగా మారింది.