పదేళ్లుగా తెలంగాణా రాష్ట్రం పై తిరుగులేని అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి మరికొంత కాలంలోనే జాడ లేకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పటి మందీ మార్భలాన్ని చూసుకొని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు ఆయన అనుచరగణం ఏకంగా ఢిల్లీ పీఠం పైనే కన్ను వేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉద్యమ పార్టీగా జనంలో నాటుకు పోయిన తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని కాస్తా అనూహ్య రీతిలో భారత రాష్ట్ర సమితి (భారాస)గా మార్చేశారు. దీంతో ఉద్యమ పార్టీ పేరు నామరూపాలు లేకుండా పోయింది. గత ఏడాది శాసనసభ ఎన్నికల్లో నేతలు బోర్లా పడడానికి పార్టీ పేరు మార్పు సైతం ఒక రకంగా ప్రధాన కారణమనే అభిప్రాయాలు వెల్లడైన ముచ్చట అందరికీ తెలిసిన విషయమే.
భారాసగా పేరు మార్చిన తర్వాత జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ కలలు కన్నారు. అందులో భాగంగానే పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. అప్పటి ప్రగతి భవన్ నుంచి వందల కొద్ది వాహనాల భారీ కాన్వాయితో పెద్ద ఎత్తున హంగామా చేశారు. భారతీయ జనతా పార్టీ, దానితో అంటకాగుతున్న పార్టీల పై దుమ్మెత్తి పోశారు. నరేంద్ర మోడీ పై విరుచుకు పడ్డారు. అరవింద్ కేజ్రివాల్, మాన్ ప్రీత్ మాన్, అఖిలేష్ యాదవ్ వంటి నేతలతో ప్రగతి భవన్ లో మంతనాలు జరిగేవి. వారి నుంచి స్పందన రావడం వెనక రాజకీయ కారణాలు, సమీకరణలు ఉన్నాయనే లోగుట్టుని కేసీఆర్ గ్రహించలేక పోయారానే విషయం అధికారం చేజారాక గాని అర్థం కాలేదు.
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేయాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర భారాస కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ, వారికి అధినేత నుంచి ఎలాంటి దిశా నిర్దేశం లేకపోవడంతో జెండా ఎగరలేదు. ఇక మహరాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగు పెట్టాలని భావించారు. ఆ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ని నియమించారు. రావెల కిషోర్ ని కూడా నమ్ముకున్నారు. భారాస అంచనాలు తలకిందులు కావడంతో ఈ ఇద్దరూ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆంధ్రలో భారాస అనాధగా మారింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా జాతీయ స్థాయిలో దృష్టి సారించాలేని దుస్థితి. రాష్ట్ర నేతలలో ఒకరొకరు జారిపోతున్న తరుణంలో భారాస పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా ఉంది. గులాబీ దళంలో కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం భారాస “బాస్”కి మింగుడు పడడం లేదు.
ఫామ్ హౌస్ దాటని ఢిల్లీ “కల”…
కేసీఆర్,కెటిఆర్, హరీష్ రావులు బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ పార్టీ మనుగడ పై మలగుల్లలు పడుతున్నారు. ఢిల్లీ గద్దెపై గురి పెట్టిన పది నెలల్లోనే అధికారం ఏమో గానీ అధినేత కేసీఆర్ గారాల పట్టీ కవిత ఢిల్లీలో ఊసలు లెక్కపెట్టడం అప శకునంగా మారింది. మద్యం ముడుపులకు మొన్నటి వరకు ఆరోపణల ముసుగు వేసి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించిన కవిత, నిందితురాలిగా జైలుకు వెళ్ళడం జాతీయ స్థాయిలో భారాసకు మాయని మచ్చ వేసింది. అధికారం కోసం ఢిల్లీ వెళ్లాలనుకున్న గులాబీ నేతలు ప్రస్తుతం కవిత వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడానికీ, ఆమె ములాఖాత్ కోసం తీహార్ జైలు చూట్టూ తిరగాల్సిన దయనీయ స్థితి.
కేశవరావు, కడియం శ్రీహరి వంటి కుడి, ఎడమ బాహువులు ఒక్కసారిగా దూరం కావడం నిజంగా కెసిఆర్ ఒంటెత్తు పోకడలను ప్రత్యేక సాక్ష్యంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, 2014లో అప్పటి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన ఇతర పార్టీల నేతలకు, ఇప్పుడు కాంగ్రెస్, భాజపా కండువా కప్పుకుంటున్న భారాస సిట్టింగులకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో తీగల కృష్ణా రెడ్డి వంటి వారు రకరకాల ప్రభుత్వ వేధింపులకు గురై తప్పని పరిస్థితిలో గులాబీ దళానికి జై కొట్టాల్సి వచ్చింది. కానీ, ప్రస్తుతం భారాస అధినేత వైఖరి మూలంగానే అధికారాన్ని కోల్పోయినట్టు, ఆ పార్టీ భవిష్యత్తు కూడా గడ్డుగా మారే సూచనలు కనిపిస్తున్నాయనే అంచనాల మధ్య కాంగ్రెస్,భాజపాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే, మళ్ళీ ఉద్యమ నేత కెసిఆర్ గ్రామాలకు వెళ్ళి రైతుల గోస పై పోరాటం చేస్తారనే భారాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ మాటలు ఏమేరకు ఆచారణలోకి వస్తాయో, రెక్కలు రాలిన గులాబీ ఎలా కొత్త రెమ్మలు తొడుగుతుందో వేచి చూడాలి.