పొట్టి ప్రపంచకప్ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టికప్పును భారత్ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో క్లాసెన్ (52: 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. క్వింటన్ డికాక్ (39: 31 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), స్టబ్స్ (31: 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, బుమ్రా 2, అర్ష్‌దీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టపోయి 176 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఒక్క బంతి వ్యవధిలోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్ (3) సైతం రబాడా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి క్లాసెన్‌కు దొరికిపోయాడు. ఐదు ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను అక్షర్ పటేల్‌తో కలిసి కోహ్లీ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి క్రీజులో నిలదొక్కుకొని వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదేశారు. అర్ధశతకానికి చేరువలో సమన్వయ లోపంతో అక్షర్ పటేల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో శివమ్ దూబె (27; 16 బంతుల్లో 3×4,1×6)తో కలిసి కోహ్లీ మెరుపులు మెరిపించాడు. జడేజా (2), హార్దిక్ పాండ్య (5*) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా మార్కో యాన్సెన్, రబాడ చెరో వికెట్ తీశారు.