పొంచివున్న “రెండు కళ్లు”…!

eye c

రాజకీయ చాణక్యం, జగన్ పాలనలో లోపాలను వెలుగెత్తిచాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థితిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వైభవం అక్కడ ఒక వెలుగు వెలుగుతోందనడంలో సందేహం లేదు. కానీ, చంద్రబాబు అమితంగా ఇష్టపడే హైదరాబాద్ పై ఆయన మమకారం చెక్కుచెదరనట్టు కనిపిస్తోంది.

ఛత్రపతి” సినిమాలో “ఒక్క అడుగు” అనే డైలాగు మాదిరిగా, ముఖ్యమంత్రి హోదాలో చర్చల కోసం తెలంగాణలో అడుగు పెట్టిన బాబు తమ పార్టీ శ్రేణులను ప్రేరేపిస్తున్న తీరు ఆయన గతంలో పాటించిన “రెండు కళ్ల” విధానాన్ని తలపిస్తోందని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన ప్రసంగం తీరు చూస్తే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తారనే ఆశ ఆ పార్టీ అభిమానుల్లో చిగురిస్తోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లపై పార్టీ కార్యకర్తలు చేసిన హడావుడి దీనికి బలం చేకూరుస్తోంది. తెలంగాణ గడ్డపైన తెలుగుదేశం పార్టీ పుట్టిందని, ప్రాభవం కోల్పోయిన టీడీపీని మళ్ళీ నిర్మిస్తామని చంద్రబాబు భరోసా వ్యాఖ్యలు చేశారు.

hardcore
బాబుతో భారాస ఎమెల్యేలు

అంతేకాదు, పార్టీని బలోపేతం చేయడానికి యువరక్తాన్ని ఎక్కిస్తామని, పార్టీలో అన్నివర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. త్వరలోనే పార్టీ నిర్మాణ కార్యక్రమం చేపట్టనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. తను చేసిన అభివృద్ధిని పదేళ్ల పాటు భారత రాష్ట్ర సమితి కొనసాగించిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే అభివృద్ధిని కొనసాగిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి మహానగరం పై ఆయనకు ఎంత మమకారం ఉన్నదో తేలిపోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

babu tummala
మాజీ “బాస్” తో మంత్రి తుమ్మల

మరో ముఖ్యమైన అంశం బాబు చాణక్యానికి అద్దం పట్టేలా ఉంది. ఒకవపు భారతీయ జనతా పార్టీ, జనసేనలతో అంటకాగుతూనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగడడం అంతుపట్టని వ్యవహారం. అయితే, విశ్లేషకులు దీన్ని పూర్తీగా రాజకీయ కోణంలో పరిశీలిస్తున్నారు. తెలంగాణలో బాబుకి బద్ధ విరోధి అయిన కేసీఆర్ ని మరింతగా  కోలుకోకుండా చేయాలంటే ఇదే సరైన సమయంగా బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ముందుగా తెలంగాణలో నిద్రావస్థలో ఉన్న టిడిపి శ్రేణులను ఉద్దేజ పరిచేందుకు బాబు పావులు కదుపుతున్నట్టు ఆయన రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో బహిర్గతం అయింది.

babu rvnt 3

ఒకవైపు భారాసను మట్టికరిపించాలని రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్న సంగతి చంద్రబాబుకు తెలుసు. అందుకే పోరుగడ్డ పై టిడిపి పుంజుకునేంత వరకు రేవంత్ తో కొంత సఖ్యతగా ఉండాలనేది బాబు ఆలోచనగా ఉందని రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే, తెలుగు గడ్డ పైనే పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు ప్రసంగించారు. కానీ, ఆంధ్రా ప్రాంత తెలుగు గడ్డ పైనా లేక తెలంగాణ బిడ్డల మధ్యనా అనేది చెప్పలేదు. అంటే ఆయన మనసు “రెండు కళ్ల” భావాన్ని కోరుకుంటోందని స్పష్టం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *