దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టపరిచే వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తుంటే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన అధిష్టానానికి ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి ఇరకటంలోకి లాగింది. మూడేళ్ల కిందట తెలంగాణ నా “మెట్టినిల్లు”, ఇక్కడే చదివా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, పిల్లాలను కన్నా, చివరి వరకు ఇక్కడే ఉంటా అంటూ మూడేళ్ళ కిందట మహా ఆర్భాటంగా ఏర్పాటు చేసిన “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ”ని సరిగ్గా ఎన్నికల సమయానికి పాదయాత్రతో ఆమె తొక్కేశారు.
అ తర్వాత సొంత అన్నపై పోరాటం చేస్తానని, మహానేత పేరుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తా అనే మాటలతో కర్ణాటక నేతలు మధ్యవర్తులుగా షర్మిల పావులు కదిపారు. అప్పటి పరిస్థితులను ఎలా అంచనా వేశారో ఏమో కానీ, అనేక మంది సీనియర్ నేతలు ఆ రాష్ట్రంలో ఉన్నవిషయం తెలిసి కుడా షర్మిలను ఏకంగా ఆంధ్రపదేశ్ కాంగ్రెస్ కమిటీ పీఠానికి అధ్యక్షురాలుగా అధిష్టానం ప్రకటించింది. అంతేకాదు, తమకు దిశా, నిర్దేశం చేసే నాయకత్వం లేకుండా పదేళ్లుగా సుప్తావస్థలో ఉన్న శ్రేణులను ఉత్తేజపరచడానికి ఎన్నికల సమయంలో షర్మిల మాత్రమే సరైనట్టు అధిష్టానం ఆలోచించింది.
కానీ, ఆంధ్రా లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టుకున్న మరుక్షణం నుంచే షర్మిల వ్యూహాలు ఒక్కోక్కటిగా బయటకు వచ్చాయి. జగన్ కి ఆమెకు నాలుగు గోడల మధ్య జరిగిన ఘర్షణలు, కుటుంబ కలహాలను జనానికి పూస గుచ్చినట్టు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల వేదికలను అడ్డాగా మార్చుకున్నారు. దీనికి ఆమె చేసిన ప్రసంగాల రికార్డులే సజీవ సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన సభల్లో కేవలం అన్నయ్య జగన్ ని దోషిగా నిలబెట్టే ప్రసంగాలు, ప్రయత్న్లాలు చేయడం పార్టీకి తీరని నష్టం చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె కుటుంబ వ్యవహారాలు తెలుసుకుందామనే తాపత్రయం అప్పట్లో సామాన్య జనంలోనూ కనిపించింది. ఏ సభలో జగన్ పై ఎలాంటి కొత్త విషయాన్ని వెళ్లడిస్తుందో అన్న ఆసక్తి సైతం ప్రజల్లో పెరగడం విశేషం. బహుశా విషయాలు తెలుసుకోవడానికే కాబోలు ఆమె సభలకు అశేషంగా జనం కూడా వచ్చారనే వాదనలు కూడా రచ్చబండల వద్ద వినిపించాయి.
పెద్దాయన ఆశయాలను, కాంగ్రెస్ పార్టీ హామీలను సమర్ధవంతంగా ప్రజల్లోకి ప్రజల వద్దకు తీసుకువెళ్ళక పోవడం ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయిందనే విశ్లేషణలు గుప్పుమన్నాయి. చివరకు షర్మిల కూడా సొంత గడ్డపై ఓటమిని చవి చూశారు. కనీసం వైఎస్ ఆత్మగా పేరున్న కెవిపి రామచంద్రరావుకి సభా వేదికల పై సముచిత స్థానం కల్పించి ఉంటే ఎంతోకొంత ఫలితం దక్కేడనే సూచనలు వస్తున్నాయి. షర్మిల కుటుంబ విషయాలను పక్కన పెట్టి, పార్టీ వ్యూహాలను జనంలోకి తీసుకువెళ్లి లాభం జరిగేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల తర్వాత ఆమె ఆ రాష్ట్రంలోని పార్టీ నాయకులకు దూరం అయ్యారనే ఆరోపణలు మొదలయ్యాయి. ఇంత కాలం పార్టీ కోసం పని చేసిన సీనియర్లను సైతం పక్కన పెట్టి కొంతమంది అనుయాయులతో ఒంటెత్తు పోకడలు అవలంభిస్తోందని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేయడం గమనార్హం. అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలను రద్దు చేస్తున్నట్టు షర్మిల ప్రకటించడంతో రాజుకున్న నిరసన సెగ డిల్లీ పెద్దలకు అంటుకుంది.
ఇదిలా ఉంటే, గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి షర్మిల నైతిక బాధ్యత వహించాలని ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆమె సొంత నిర్ణయాల వల్ల భవిష్యత్తులో పార్టీకి మరింత తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా కొందరు పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, శివ కుమార్ ల దృషికి తీసుకువెళ్ళారు. కొద్ది రోజులుగా ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు మరీ అధికమయ్యాయి. ఆమె ఒంటెద్దు పోకడలు భరించలేక ఆంధ్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మ, రాకేష్ రెడ్డి వంటి నేతలు తమ ఆవేదనను రాహుల్, సోనియా గాంధీ లకు వెళ్లబుచ్చుకున్నారు. ఒక రాష్ట్రంలో సొంత పార్టీని మూత వేసి, ఇంకో రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలిపించలేని నాయకురాలి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.