అమ్మా, అయ్యల సంపాదన, వారి కలలను ఆసరాగా చేసుకొని పై చదువులు, ఉద్యోగాల పేరుతో దేశం కాని దేశంలో అడుగు పెట్టి బతుకు భారం కావడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. అనేక రకాల అభివృద్ధికి వాడాల్సిన తెలుగు తెలివిని ఉహించని విధంగా దుర్వినియోగం చేశారు. కట్టుదిట్టమైన నిబంధనలు ఉండే “పెద్దన్న” దేశం అమెరికాలో ఏకంగా మానవ అక్రమ రవాణా కు ఎత్తులు వేశారు. ఈ నలుగురు దొరికి పోయారు. అమెరికా వీసా దొరకడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో దాన్ని చేజిక్కించుకొని అక్రమాలకు పాల్పడడం నిజంగా భవిష్యత్తు మీద ఎంత మాత్రమూ భయం లేక పోవడమే కారణం. తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టడమే నేర పూరిత ఆలోచనలకు అంకురార్పణ. అమెరికాలో తెలుగు పిల్లలు మానవ అక్రమ రవాణా ముఠాను తయారు చేయడం సిగ్గు చేటు. అక్కడి గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఒక ఇంటిలో అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మందికి పైగా యువతులు నరక యాతన అనుభవించారంటే పరిస్థితి ఎంత చేయిజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రిన్‌స్టన్ పోలీసులు ఈ భయంకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. సుమారు 100 మంది కంటే ఎక్కువ మంది ఈ నేరంలో భాగమై ఉంటారని, వారిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. అక్కడ మానవ అక్రమ రవాణా చేస్తున్న చందన్ దసిరెడ్డి (24), ద్వారక గుండా (31), సంతోష్ కట్కూరి (31), మరియు అనిల్ మాలే (37) అనే వ్యక్తులను ప్రిన్‌స్టన్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళను పూర్తీ స్థాయిలో విచారిస్తే గానీ మరిన్ని వివరాలు బయటికి వస్తాయని పోలీసులు తేల్చి చెబుతున్నారు.