భవన నిర్మాణ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. పూరి గుడిసె నుంచి భారత పార్లమెంటు వరకు నిర్మించే ఈ వర్గానికి సొంత ఇల్లు లేక పోతే ఇక కాంగ్రెస్ ప్రజా పాలనకు అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదు మెట్టు గూడ లోని జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా కేఎస్ఆర్ గౌడ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సొంతింటి కల సాకారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం ఆధ్వర్యంలో ఉద్యమ ప్రణాళిక రూపొందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో చేపట్టే అన్ని రకాల నిర్మాణాలను పూర్తి చేయడంలో జీవితాంతం కాలం వెళ్ళబుచ్చే భవన నిర్మాణ కార్మికునికి వచ్చే కూలీ పొట్టకు, బట్టకే సరిపోవడం లేదు. పిల్లల చదువుల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ఇక కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే దేవునిపై భారం వేసి జీవితాన్ని వెళ్ల దీసే స్థితి నెలకొంది.
ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం సొంత ఇంటితో వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటున్నారు. ఇలాంటి వారి అందరికీ తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు లేక 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని కేఎస్ఆర్ గౌడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని దొరికిన నెలలో సకాలంలో కిరాయి ఇచ్చినా పని దొరకని నెలలో భవన నిర్మాణ కార్మికులు కిరాయి కట్ట లేక పడే అవస్థలు అంతా ఇంతా కాదని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం అన్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే ఇంటి యజమాని తక్షణమే ఇల్లు ఖాళీ చేయించి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలనే ఆందోళన చేపట్టనున్నామని, మొదటగా రాష్ట్రంలోని అన్ని మండల అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ లోని పలు బస్తీల్లో అర్హులైన వారి జాబితాను తమ శ్రేణులు సేకరిస్తున్నాయని జేఎస్టీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ తెలిపారు.