బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను పారిశ్రామికవేత్త ఆధానికి దోచి పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. హుస్నాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ దేశంలో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆదాని ఒక రోజు సంపాదన 1600 కోట్లు అని తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం బడ పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారి దేశ సంపదను అప్పనంగా అప్పగిస్తుందని మండిపడ్డారు. దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వ ధోరణిని అర్థం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఢిల్లీలో బిఆర్ఎస్ కు బిజెపి, తెలంగాణలో బిజెపికి బిఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఎంఐఎం తెలంగాణ పార్టీ అని దేశంలో 60, 70 స్థానాలకు పోటీ చేస్తూ తెలంగాణలో కేవలం ఏడు స్థానాలలో పోటీ చేయడం చూస్తుంటే ఎంఐఎం దేశంలో బిజెపికి రాష్ట్రంలో బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని, రైతులకు రుణమాఫీ జరగలేదని మహిళలకు రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీతో సంతోషంగా ఉన్నారా అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత పది సంవత్సరాలలో ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించారని గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడమే నిదర్శనం అన్నారు. సాగు, త్రాగునీరు వస్తున్నాయా అని ప్రజలను ప్రశ్నించారు.

భూ సేకరణ చట్టం అమలు అయిందా, విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగారు. పీవీ నరసింహారావు, సర్దార్ పాపన్న పౌరుషం గల ప్రాంతం హుస్నాబాద్ అన్నారు. ఇందిరమ్మ కు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉండేవారని దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు తన తండ్రి రాజీవ్ గాంధీ మరణించినప్పుడు పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. హుస్నాబాద్ ప్రాంత సమస్యలపై మీ ఎమ్మెల్యే స్పందించారా అని ప్రశ్నించారు. గత 10 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా తెలంగాణలో బిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఏం జరగలేదని అన్నారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో క్షేత్రస్థాయిలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు, దళితులకు, నిరుద్యోగులకు న్యాయం జరగలేదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో కనీస స్పందన లేదని, అవినీతికి నిలయాలుగా మారాయని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో ప్రతి రంగంలో అవినీతి చోటుచేసుకుందని అన్నారు. మహాత్మా గాంధీ నాటినుండి నేటి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల మధ్యనే ఉంటుందని, ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతుందని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, కార్మిక తదితర రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవలే మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలాగా క్షుణ్ణంగా వివరించారు. మనభూమి.. మన చెమట.. ఓటు కు ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఈనెల 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
