గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో…!

babu pawan c
babu 1

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు, ఆసక్తికర కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన జనసేన చంద్రబాబు జైలులో ఉండగానే తెలుగుదేశంతో పొత్తు ఖరార చేసుకుంది. ఇదే సందర్భంలో బిజెపితోనూ సఖ్యతగా మెలుగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేసింది. దీంతో తెలుగుదేశం, జనసేన కలసి ఎన్నికల బరిలోకి దిగితే అభ్యర్ధుల గెలుపు, ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరెక్కుతారనే చర్చలు మొదలయ్యాయి.

pawan55

ఆ పదవి దక్కించుకోవాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ శతవిధాల పోరాడుతున్న విషయం బహిరంగ రహస్యమే. జనసేన రోడ్ షోలలో “తనకే ఒక్క ఛాన్స్” ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ ఆర్జించడం, ఇదే తరహాలో చంద్రబాునాయుడు సైతం అభివృద్ధి కావాలంటే ఇంకో అవకాశం ఇవ్వాలని సభల్లో కోరడం అందరికీ తెలిసిందే. అయితే, రాజమండ్రి జైలు గోడల మధ్య జరిగిన పొత్తు చర్చల్లో ముఖ్యమంత్రి పదవి ఎవరికి అనే ప్రధాన అంశం ప్రస్తావనకు వచ్చిందా రాలేదా అనేది బయటికి పొక్కని గోప్యం. రేపు ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్లాలంటే ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది తేలాలి. జనానికి దీనిపై స్పష్టత ఇవ్వవలసిన భాధ్యత అటు చంద్రబాబు, ఇటు పవన్ పై ఉంది. దీన్ని తేల్చుకోకుండా ప్రజల్లోకి వెళ్లడం అంత సులువైన వ్యవహారం కాదనే సంగతి రాజకీయ చాణక్యుడు చంద్రబాబుకు తెలియంది కాదు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తో పొత్తుకి వెళ్ళారా లేక ఎన్నికల లోపు కూడా చంద్రబాబు బయటికి రాకపోతే తానే ముఖ్యమంత్రి అనే భావనతో అయన చంద్రబాబుతో చేయి కలిపారా అనే కీలక అంశాలను విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. ఇవే సందేహాలు సామాన్య ప్రజల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంపై అంతర్గతంగా సమాలోచనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *