చిన్నా, చితక సామాన్లు ఎత్తుకుపోతే ఏం లాభం అనుకున్నారేమో అందుకే తిరుపతిలో దొంగలు ఏకంగా బస్సునే దొంగిలించారు. అదీ ఏడుకొండల స్వామి దర్శనానికి భక్తులను తీసుకువెళ్ళే తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు కావడం గమనార్హం. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సును చోరీ చేశారు. ఈ ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. చోరీ విషయాన్ని గుర్తించిన వెంటనే జిపిఎస్ ఆధారంగా బస్సు కదలికలను పరిశీలించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద బస్సు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ సమాచారాన్ని నాయుడుపేట పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీసులు బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తంచిన దొంగలు బస్సు నుంచి దూకి ఉడాయించారు. రవాణా శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి బస్సు చోరీ…
