ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్వేష పూరిత రాజకీయాల గతంలో ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూదిగజారుతున్నాయని, రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించినట్టు, వాటిలో చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదని ఆమె తెలిపారు. ఇది ప్రభుత్వ రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని, గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. తెలుగు దేశం, జనసేన రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటు పై లోకేష్ చర్చిస్తున్నారని తనను కలిసిన జనసేన నేతలకు ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు. స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.