updates

ఇస్తాం..ఇస్తాం..తప్పక ఇస్తాం..

jornlist harish scaled

హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతామని వెల్లడించారు. కోర్టు కేసుల కారణంగా హైదరాబాదులో జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించడం ఆలస్యమైందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరవాత కోర్టు కేసు పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టి ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేసి, జడ్జిమెంట్ జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు సహకరించామని తెలియజేశారు. ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు కాగానే జర్నలిస్టు హౌసింగ్ సమస్యను ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్త, పాత సొసైటీల్లోని సభ్యులందరికి కలిపి ఒకేసారి ఇళ్ల స్థలాలను కేటాయించే దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతామని ఆయన చెప్పారు. జిల్లాల్లో ఇప్పటికే మెజారిటీ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. అదే క్రమంలో హైదరాబాదులోని జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *