హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించిన నటుడు చంద్రమోహన్ (82) ఇక లేరు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దాదాపు 57 సంవత్సరాల వెండి తెర జీవితంలో ఓ మంచి హాస్య నటునిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు చూపరి చితులు. సుమారు 932 సినిమాల్లో విభిన్న రకాల పాత్రలతో చంద్రమోహన్ ప్రతీ ఒక్కరిని మెప్పించారు. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్. శ్రీదేవి, జయసుధ, జయప్రదల వెండితెర అరంగేట్రంలో మొదటి హీరో చంద్రమోహన్ కావడం గమనార్హం. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 23, మే 1945 లో జన్మించారు.అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తొలి సినిమాకే ఉత్తమ నంది అవార్డు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్.

1966వ సంవత్సరంలో రంగుల రాట్నంతో తెరకు పరిచయమయ్యారు. శ్రీదేవితో కలిసి నటించిన “పదహారేళ్ల వయసు” సినిమాలో ఆయన నటన చిరస్మరణీయం. ఈ సినిమాలో ఆయన చూపిన అద్భుత నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్, చిన్నోడు పెద్దోడు,ప్రేమించుకుందాం రా..నిన్నే పెళ్లాడుతా, కృష్ణ,పౌర్ణమి, పంచాక్షారి వంటి అనేక సినిమాల్లో చంద్రమోహన్ నటన అజరామరం. అయన ప్రేక్షకులకు చివరిగా నవ్వుల “ఆక్సిజన్” ఇచ్చారనవచ్చు. గోపీచంద్ నటించిన ”ఆక్సిజన్” ఇప్పటివరకు చంద్రమోహన్‌కి చివరి సినిమా. చంద్ర మోహన్ భార్య జలంధర్ రచయిత్రి. మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్ అమెరికాలో స్థిరడ్డారు. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో ఉంటున్నారు. దర్శకులు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు కావడం విశేషం.
