ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంత ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కృష్ణా నది ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతుందనేది తెలిసిన అతికొద్దిమందిలో తానూ ఒకడినని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు గత పాలకులు ఈ ప్రాజెక్టుకు హడావుడిగా శంకుస్థాపన చేశారని జగన్ గుర్తుచేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, భూ సేకరణ చేపట్టకుండానే టెంకాయ కొట్టి ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు కోసం పట్టుదలగా ప్రయత్నాలు చేపట్టామని, ఈ నెల 6న అటవీ శాఖ అనుమతులు రావడంతో ప్రస్తుతం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని వివరించారు.
వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. పల్నాడు ప్రజల తాగు, సాగు నీటి కష్టాలను దూరం చేసేందుకే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని చెప్పారు. దశల వారీగా మాచర్ల నియోజకవర్గం, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు విస్తరిస్తూ ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు.పనులన్నీ పూర్తయి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. ప్రారంభ దశలలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుతో 25 వేల ఎకరాలకు సాగు నీరు, 20 వేల మందికి తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.
ఏపీలో పూర్తిగా పైప్ లైన్ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు ఇదేనని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. మాచర్ల చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమాలపు సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు