తెలంగాణ శాసన సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్నా ప్రచారంలో జనసేన జాడ కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని తొమ్మిది నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రచార తెరపై కనిపించక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజక వర్గాల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతుంటే జనసేనా కనీసం దాని మిత్ర పక్షమైన బిజెపి సభలలోను కనిపించకపోవడం అర్ధం కాకుండా ఉందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేతగా, జనాకర్షణ ఉన్న నటుడు ప్రచారంలో కనుమరుగు కావడం రాజకీయ పరిశీలకులను కూడా అయోమయమలో పడేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో “వారాహి”పై సభలు, రోడ్ షోలతో హోరెత్తించే పవన్ కళ్యాణ్ అలాంటి ప్రచార వ్యూహాన్ని తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు రూపొందించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పోటీ చేస్తున్న కూకట్ పల్లి , తాండూరు, కోదాడ, ఖమ్మం, అశ్వారావుపేట వంటి ప్రాంతాల్లోనూ అధినేత కన్నెత్తి చూడకపోవడం అక్కడ “సేన” తరఫున భరిలో ఉన్న అభ్యుర్దుల్ల్లో అసంతృప్తి పెరుగుతోంది. కనీసం తొమ్మిది నియోజక వర్గాల్లోనైనా “వారాహి” యాత్రలను చేపడితే పార్టీ శ్రేణుల్లో కొంతమేరకైనా ఉత్సాహం నింపవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించినబహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏప్రచార సభలోనూ దర్శనం ఇవ్వలేదు. బిజెపికి చెందిన కేంద్ర స్థాయి నేతలు ప్రచారానికి వచ్చి వెళ్తున్నా ఈ ఒక్క సభ లోను పవన్ కళ్యాణ్ కానీ ఈ పార్టీకి చెందినా ప్రముఖ నేతలు కానీ పాల్గొనక పోవడం వెనుక ఉన్న ఆంతర్యం అర్ధం కాక పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నాయకులూ, కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలవని ఆంధ్రప్రదేశ్ లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించే పనిలో ఉండడం కుడా తెలంగాణ “సేన”లకు మింగుడు పడడం లేదు. తెలంగాణ లోని తొమ్మిది నియోజక వర్గాల్లో బిజెపి అగ్రనేతలు నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, సంజయ్ వంటి వారితో ఎన్నికల సభలు నిర్వహించే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే సూచనలు కూడా “సేన”ల నుంచి వినిపిస్తోంది. బిజెపి నేతలతో హోటళ్ళు, కార్యాలయాల్లో జరిపే చర్చల వల్ల ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి,లక్ష్మణ్, బండి సంజయ్ లాంటి వారిని కలిసి ప్రకటనలు చేయడం కంటే వాళ్లతో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొంటే ఫలితం వేరే విధంగా ఉంటుదనే అభిప్రయమూ వ్యక్తం అవుతోంది. బిజెపితో చేతులు కలిపిన తర్వాత ఆ పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ తెలంగాణ లోనూ ప్రచారంలో పాల్గొంటారని కొందరు భావించారు. చరిస్మా ఉన్న వ్యక్తిగా సభల్లో పాల్గొంటే ఇరు పార్టీల క్యాడర్ కి మంచి ఉత్సాహం వచ్చేదనే మాటలు కూడా చర్చల్లో వినిపించడం గమనార్హం. ప్రచార గడువు దగ్గర పడుతున్నందున బిజెపి “తమ్ముడు” ఏ మేరకు సభల్లో కనిపిస్తారో వేచి చూడాలి.