తెలంగాణ ప్రాంతంలో మేకపోతు గాంభీర్యం చూపించిన జనసేన పార్టీని ప్రజలు ఖాతరు చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ క్యాడర్ ఒక్కసారిగా న్యూట్రల్ మోడ్ లోకి వెళ్ళింది. కనీసం ఆంధ్రాలో మాదిరిగా ఇక్కడ కూడా జనసేనతో బరిలోకి దిగుతుందేమో అని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశంతో సంబంధం లేకుండా తెలంగాణలో జనసేన ఒంటరిగానే రంగంలోకి దూకే ప్రయత్నం చేసింది. అందుకే 32 స్థానాల్లో పోటీ చేస్తుందని నియోజక వర్గాల జాబితా సహా పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటించడంతో తెలుగుదేశం తెలంగాణలో పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి తలెత్తిందని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.32 చోట్ల పోటికి నిర్ణయించుకున్న జనసేన చివరికి బిజెపితో కలిసి 8 స్థానాలతో సరిపెట్టుకుంది. పోటీకి దిగిన తాండూరు,అశ్వారావుపేట, ఖమ్మం, వైరా,నగర్ కర్నూలు, కోదాడ,కూకట్ పల్లి,కొత్తగూడెం స్థానాల్లో మొక్కుబడి ప్రచారం చేసి జనసేన చేతులు దులుపుకుంది. వలస ఓటర్ల ప్రభావం ఉన్న ఒక్క కూకట్ పల్లి ప్రాంతంలో మినహా “సేన్” అభ్యర్తులకు మిగతా చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఖమ్మం ప్రజల రాజకీయ చైతన్యాన్ని పూర్తిగా అంచానా వేయకుండా కేవలం ఆంధ్రా సరిహద్దు అనే అంచనాలతో ఖమ్మం జిల్లాలోనే నాలుగు చోట్ల జనసేన పోటీ చేసింది. అయితే, ఎక్కడ గానీ ఓటర్లు ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన గ్లాసును ముట్టక పోవడం గమనార్హం. తెలంగాణలో జనసేన,బిజెపిల కలయిక, ఫలితాల తిరు రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.