గేరు మార్చిన“సారు”–దారి తప్పిన“కారు”!

brs C

తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయం.., ఆ తర్వాత ఏకంగా దేశాన్నే ఏల వచ్చు అనే  గంపెడు ఆశలతో మొన్న జరిగిన ఎన్నికల ముందు “ఒంటెత్తు” వ్యూహా రచనలు చేసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. తెలంగాణలో దశాబ్ద కాలంగా తిరుగులేని అధికారం చెలాయించిన బి.అర్.ఎస్. పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో నేతల ఆలోచనలన్నీ కుడితిలో పడ్డ ఎలుకలా మారాయి. ఆరేడు నెలల కిందటి పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయనే నమ్మకంతోనో, లేక భ్రమతోనో  గాని రెండు దశాబ్దాలుగా ఉద్యమ పార్టీగా ఒక వెలుగు వెలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి కాలం చెల్లిందనే రీతిలో అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ పార్టీ పేరుని మరచిపోయేలా చేశారు. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ముగ్గురు, నలుగురు నాయకుల సరసన చేరే సరికి ఉద్యమ పార్టీ పేరుని కాలరాసి దాన్నే భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఈ  ఒక్క నిర్ణయంతోనే తెలంగాణలో బి.ఆర్.ఎస్.గా మారిన టీఆర్ఎస్ ప్రాభవం కనుమరుగు కావడం మొదలైందని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులే అభిప్రాయపడుతున్నారు.

kcr kejriwl
అప్పటి ప్రగతిభవన్ లో

ప్రగతి భవన్ నుంచి తెలంగాణ ప్రజల కోసం సాగించాల్సిన పాలనను మరచిపోయి, పొరుగు రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలపై మోజు చూపడం ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేసిందని రాజకీయ పరిశీలకుల అంచనా. నాగపూర్ లో ఏకంగా పార్టీ కార్యాలయాన్నే నిర్మించారు. దీన్ని జూన్ నెలలో కేసీఆర్ ప్రారంభిచారు. అంతేకాదు, హైదారాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో అట్టహాసమైన పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ అఖిలేష్ యాదవ్, కేజ్రివాల్ వంటి నేతలతో బి.అర్.ఎస్. పార్టీ వ్యూహాలను చర్చించడానికి అధికార నివాసమైన ప్రగతిభవన్ ని అడ్డాగా చేసుకోవడం కూడా అధికారులు, మేధావీ వర్గానికి నచ్చలేదు. ప్రగతిభవన్ దాటి బయటకు రాని కేసీఅర్ జాతీయ స్థాయిలో తనకు, తన పార్టీకి ఎంత  బలం, బలగం ఉందనే విషయాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసుకో కుండా పొరుగు రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటక శాసనసభల ఎన్నికల ప్రచారానికి వెళ్లడం కూడా తెలంగాణ లో వ్యతిరేక పవనాలు పుట్టుకురావ డానికి మరో కారణంగా చెప్పుకుంటు న్నారు. ప్రగతి భవన్ నుంచి వందలాది కార్లు, మంది మార్బలంతో ప్రదర్శనగా వెళ్లడం, ఆ రాష్ట్రాల ఎన్నికల్లో చురు కుగా పాల్గొని, కేంద్ర ప్రభుత్వం, బిజెపి, కాంగ్రెస్ పార్టీలను దుమ్మెత్తి పోసిన తీరుతో కేసీఆర్ చూపు ఇక జాతీయ స్థాయిలో ఉందనే భావన తెలంగాణ సమాజంలో పెరగడానికి కారణమైంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది అధికార పార్టీ వ్యవ హార శైలి వల్ల ప్రజల్లో ఆ పార్టీ పై ఆదరణ తగ్గుతూ వచ్చినట్టు ఎన్నికల ఫలి తాలు సాక్ష్యంగా నిలిచాయి.

mha kcr in
మహారాష్ట్ర నేతలతో…

ఇక త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు బి.అర్.ఎస్. నేతలు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీని జాతీయ రాజకీయ పటంలో చూడాలనే ఆశతో ఉన్న అధినేత పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది రాజకీయ వర్గాలలోనే కాదు సమన్యుల్లోనూ ఆసక్తిగా మారింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఏకైక లక్ష్యం అంటూ తెరపైకి తెచ్చిన బి.అర్.ఎస్.ని వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది చర్చనీయాం శమవుతోంది. సొంత రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోయిన పార్టీ, దాని అధినేతతో ఇతర రాష్ట్రాలలోని పార్టీల నేతలు ఏ మేరకు చేతులు కలుపుతారనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.మొన్నటికు  వరకు బి.అర్.ఎస్.తో అంటకాగిన ఇతర రాజకీయ పక్షాల నేతలు తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణల  నేపథ్యంలో ఆ పార్టీతో ఎంత వరకు కలిసి ముందుకు వెళ్తారో వేచి చూడాలి. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ ని ఆయనతో సన్నిహితంగా ఉన్న అనేక మంది జాతీయ స్థాయి నేతలు ఇప్పటికీ పరామర్శించక పోవడం కూడా రేపటి లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *