ఆ ఉద్యమం”అధికారం” కోసమేనా..!

absens c

తెలంగాణలో మొన్నటి వరకు తిరిగు లేని రాజకీయ పక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (భారాస) ప్రజల్లో పట్టు కొల్పోతోందా? అన్నీ తానై దిశా నిర్దేశం చేసే అధినేత కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు?  కెటిఆర్, హరీష్, కవిత, కడియం, సుమన్ వంటి నేతలు రెండు నెలల కాంగ్రెస్ పాలనపై  అడ్డూ అదుపు లేకుండా చేస్తున్న అసందర్భ విమర్శలు, ఆరోపణలకు, అసత్య ప్రచారాలకు పార్టీ పెద్దగా ఎందుకు కళ్ళెం వేయలేక పోతున్నారు? ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో అసలేం జరిగింది? ప్రజా సమస్యలపై గళం విప్పడానికి విపక్షా నేతగా శాసన సభలో అడుగు పెడతారని “పార్టీ కుటుంబం” చేసిన ప్రచారం వాస్తవం కాదా? అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు రాకుండా ఆయన ఎందుకు తప్పించుకున్నారు? ప్రగతి భవన్, సచివాలయం చేజారాయనే అసంతృప్తి వెంటాడుతోందా? అధికారం కోసమే కేసీఆర్ తెలంగాణ గళం ఎత్తుకున్నారా? ఇవే కాదు, ఇలాంటి ఇంకా అనేక సందేహాలు తెలంగాణ సమాజంలో రేకెత్తుతున్నాయి. సాధారణంగా అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండు ప్రజా సంక్షేమానికి కావలసిన మూల స్తంభాలు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం వంతు అయితే, అందులో లోపాలను ఎత్తిచూపుతూ సరిదిద్దాలని పోరాడడం విపక్షం పని. ఇందులో ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా చివరగా నష్ట పోయేది సామాన్య జనమే. అందుకే  అధికార పార్టీకి గానీ, ప్రతిపక్షానికి గానీ ఏ సమయంలో ఎలా సమాధానం చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు.  గత ఎన్నికల ఫలితాలే దీనికి నిలువెత్తు నిదర్శనం. అధికార పార్టీ పై విసిగి వేసారినప్పుడు ఎన్నికల ఫలితాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ కొమ్ములు తిరిగిన ఏ నేత అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజా క్షేత్రం నుంచి వచ్చే అదేశాలను పాటించి తీరాలి. వాళ్ళ తీర్పుకు తల వంచాలి. అదే ప్రజాస్వామ్యం. కానీ, ఇవ్వన్నీ తెలిసినా కొందరు నేతలు ప్రజా తీర్పును గౌరవించరు, పోకడ మార్చుకోరు. దీనికి ఉదాహరణ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (భారాస) పార్టీ, దాని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటూ బలమైన విమర్శలకు తెర లేచింది.

ఓడిపోతే.. మరీ అంతనా….!

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చర్చల వరకు కేసీఆర్ వ్యవహరించిన తీరును రాజకీయ పరిశీలకులు, వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు తప్పు పడుతున్నారు. పదేళ్ల పాటు అధికారంలో కుర్చోపెట్టిన ప్రజలకు ఎన్నికల్లో ఓడిపోయిన రోజు కనీసం కృతజ్ఞతలు చెప్పని విషయాన్ని నేమర వేసుకుంటున్నారు. ఒడిపోయమన్న మనస్తాపంతో ఎవరికీ కనిపించకుండా రాత్రికి రాత్రే ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయిన కేసీఆర్ దురదృష్టవశాత్తు  అక్కడ ప్రమాదానికి గురై కొద్ది రోజులు మంచానికే పరిమితం అయ్యారు. మెరుగైన చికత్స అందడంతో క్రమంగా కోలుకున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ కొద్దిరోజుల్లోనే ప్రజా క్షేత్రంలోకి వస్తారని, ఆయన అధికార పక్షంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజా సమస్యలపై గళం విప్పుతారని భారాస ముఖ్య నేతలు విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఈ నెల ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి శాసనసభకు రావడంతో ప్రజలు, రాజకీయ పార్టీలు కేసిఆర్ ఇక సమావేశాలకు రావడం ఖాయం అనుకున్నారు. సమావేశాల మొడటి రోజైన గవర్నర్ ప్రసంగ సమావేశంలో ఆయన జాడ లేదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలోను ప్రతిపక్ష నేతగా ఆయన సీటు ఖాళీగానే ఉంది. చివరకు బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజైనా, దానిపై జరిగే చర్చలోనైనా పాల్గొంటారని గట్టి ప్రచారం జరిగింది. కానీ, శాసనసభ పరిసరాల్లో ఆయన ఛాయలు కనబడలేదు. భారాస సభ్యులు సైతం కేసీఆర్ సభకు వస్తారని ఆశించినప్పటికి చివరకు అది భ్రమగా మారింది. ఇదే విషయాన్ని ఒకరిద్దరు అదే పార్టీ సభ్యులు వెల్లడించడం గమనార్హం.

kcr randa

అధినేత అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలను కూడా పార్టీ వెళ్ళడించక పోవడం మరో చర్చగా మారింది. చివరి క్షణం వరకూ “నాయకుడు” వస్తారని ప్రచారం చేసిన పార్టీ నేతలు ఆ రోజు నోరు మెదప లేదు. కానీ, అధికార పక్ష నేతలు మాత్రం వివక్ష నేత తీరును దుయ్యబట్టారు. రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండటం చూడలేక “దొర” అసెంబ్లీకి రాలేదేమో అంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ప్రతిపక్ష నేతగా ఆయన సభకు వస్తే హుందాగా ఉండేదని, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా జీవిత కాలం అధికారంలో ఉండలేదని, కేంద్రం లోనూ, ఏ రాష్ట్రం లోనూ అలాంటి చరిత్ర లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోనూ ప్రభుత్వం మారగానే ప్రతిపక్ష నేతలు గైర్హాజరు అయిన సందర్భాలు లేవని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే, తమిళనాడులో కరుణానిధి, జయలలిత ముఖ్యమంత్రు లుగా ఉన్నపుడు ఒకరి ముఖం మరొకరు చూడరాదని భీష్మ ప్రతిజ్ఞలు చేసి అసెంబ్లీకి రాకుండా ఇంటి వద్దే ఉండే వారు, కానీ, సభ్యత్వం రద్దు కాకుండా నిబంధనల ప్రకారం అసెంబ్లీ కి వచ్చి సంతకం చేసి, ప్రత్యర్ధులపై కాసేపు దుమ్మెత్తి పోసి వెళ్లి పోయేవారు, 5 సంత్సరాలూ ఇదే తంతు కొనసాగేది. తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీ లోనికి అడుగు పెట్టేవారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలోనూ ఇదే సంస్కృతి నడుస్తోంది.చంద్రబాబు హయాంలో జగన్ కొన్ని నెలల పాటు అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు అసెంబ్లీ పై అలకలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ నేత వ్యవహార శైలి కూడా అదే మాదిరిగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో మార్పు కోరుకునే ప్రజలను గౌరవించాలే గానీ వారి పై అక్కసు పెంచుకోవడం రాజకీయ పార్టీలకు మంచివి కాదని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *