మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, వీలైనంత తొందరగా మూసీ నది శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి, సరైన బాధ్యతలతో మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.