తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత మద్యం ముడుపుల కేసులో అరెస్టు కావడం మూలిగే నక్క పై “మందు సీసా” పడ్డట్టయింది. ఓటమి అనంతరం పార్టీని వెంటాడుతున్న అనేక సమస్యలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాని మనుగడకు గొడ్డలి పెట్టుగా మారాయి. నెల రోజులుగా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల్లోని కీలక నేతలు కాంగ్రెస్, భాజపా కండువాలు కప్పుకోడం “సమితి”కి మరింత సంకటంగా పణమించింది.
గత శాసనసభ ఎన్నికల్లో గెలిచి, ఈ లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తన ప్రతాపం చూపాలని భారాస గంపెడు ఆశలు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశాన్ని ఏలాలనే ఏకైక లక్ష్యంతో ఉద్యమ పార్టీగా ప్రజల్లో పాతుకుపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని కాస్తా భారత రాష్ట్ర సమితి (భారాస)గా మార్చారు. అయితే, ఆ ఒంటెత్తు నిర్ణయం, అధినేత చేసిన తప్పిదమే గత ఎన్నికల్లో పరాజయానికి కారణమని సాక్షాత్తూ ఆ పార్టీ సీనియర్ నేతలు, రాజకీయ పరిశీలకులు తేల్చి చెప్పారు. భారాస కారు పై కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సభలు నిర్వహించారు. మహారాష్ట్రలో ఏకంగా పార్టీ కమిటీని ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఇదే తలనొప్పిగా మారింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ లోక సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే విషయాన్ని తేల్చాలని అధినేత కేసీఆర్‌కు ఆ రాష్ట్ర నేతలు లేఖలు రాశారు. దీనిపై వారంలో స్పష్టత ఇవ్వాలని 15 రోజుల కిందటే వారు లేఖ రాసినా ఇంత వరకు కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది.
కేంద్రంలో ఎన్డీఏ, యుపిఎలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ప్రాభవం చాటుకోవాలని కేసీఆర్ వేసిన ఎత్తుగడ. అందులో భాగంగానే ఆయన రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలను తెరపైకి తెచ్చారు. ఇలాంటి ఎన్నో ప్రణాళికలతో జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్న గులాబీ కారు అధినేతకు తెలంగాణ ప్రజలే సడెన్ బ్రేక్ వేశారు. దీంతో ఒక్కసారిగా భారాస వ్యూహాలపై దెబ్బపడింది. జాతీయ రాజకీయాల ముచ్చట పక్కనపెట్టి రాష్ట్రంలో తిరిగి ఎలా నిలదొక్కుకోవాలనే అంశం పై గులాబీ దళం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ మేకపోతు గాంభీర్యం చూపి ఈ లోక్ సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పోటీకి కాలు దువ్వితే కవిత ముడుపుల భాగోతం , ఆమె అరెస్టు వ్యవహారం బెడిసి కొట్టవచ్చని భారాసకి చెందిన కొందరు నేతలే అభిప్రాయ పడుతున్నారు. ఉద్యమ ఆలోచనల నుంచి ఇంకా బయటపడని ఈ దళం మాంచి వేడి మీద ఉన్న దేశ రాజకీయ చదరంగంలో ఎలాంటి పావులు కదుపుతోందో వేచిచూడాలి.