గత పదేళ్ళుగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాలనలో సాగిన తెర వెనుక భాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూడడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ దళం ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎంతోకొంత లబ్ధి పొందేందుకు నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే వరకు కాళేశ్వరం, ధరణి వంటి అంశాలలో లోసుగుల వ్యవహారాలు మాత్రమే బయటకు పొక్కాయి. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి వర్గం ఆయా శాఖలో తవ్విన కొద్దీ సమస్యలు, అక్రమాలు బయట పడడం భారాసను కలవరపెడుతోంది.
మద్యం కేసులో కవిత తీహార్ జైలుకి వెళ్ళడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు డ్రెస్ వేసుకున్న దొంగల ముఠా గుట్టు రట్టవడం, స్వయానా కేసిఆర్ సోదరుని కుమారుడు భూకబ్జా దండాల్లో అరెస్టు కావడం వెరసి తెలంగాణా రాష్ట్రంలో “దండుపాళ్యం” ముఠా దోపిడీ తంతుని తలపిస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనకు తిరుగే లేదు అన్నట్టు కవిత వందల కోట్ల రూపాయల మద్యం వ్యాపార కుంభకోణంలో చక్రం తిప్పి “లిక్కర్ క్వీన్”గా దేశం నలుచెరగులా ప్రచారం కావడం ఈ ఎన్నికల సమయంలో భారాసకు తల పోటుగా మారింది. ఆమె ఏకంగా తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టడం కేసిఆర్ కుటుంబాన్నే కాదు, భారాస శ్రేణులను సైతం కుంగుబాటుకు గురి చేసింది.
ఇక దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రాల్లో కనిపించని, వినిపించని సాంకేతిక నేరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే అత్యాశతో భారాస పెద్దలు పోలీసులనే దొంగల ముఠాగా మార్చడం నిజంగా సంచలనమే. ఐపీఎస్ అధికారినే ముఠా నాయకుడిగా నియమించి జనం కోసం పని చేయాల్సిన రక్షక భటులను దోపిడీ దొంగలుగా మార్చిన ఘనత గత ప్రభుత్వానిదే అనడానికి ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, బయటకు పొక్కిన వాస్తవాలే నిలువెత్తు నిదర్శనం. విపక్షాలను ఆర్థికంగా అడ్డుకోవడమే కాక వారి వ్యక్తిగత సంభాషణను సైతం దొంగిలించిన దుర్మార్గ నేరం ఫోన్ ట్యాపింగ్ వ్యూహం.
స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్.ఓ.టి.) ఏర్పాటు చేసిన నాటి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి, కల్తీ నూనెలు, పెట్రోల్,డీజిల్ చౌర్యం, వ్యభిచార ముఠాల పై కేసులు పెట్టడమే సామాన్య ప్రజలకు తెలిసిన సంగతి. కానీ, ఆ ఎస్.ఓ.టి. ఏర్పాటు వెనక అసలు కుతంత్రం తెలిస్తే దిమ్మ తిరిగి పోతుంది. ఖాకీ యూనిఫాం ధరించని ఎస్.ఓ.టి. ముఠా సివిల్ డ్రెస్సుల్లో దందాలకు పాల్పడేది. ఫోన్ ట్యాపింగ్ సమచారం ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా లేని ప్రముఖులు, వ్యాపారులు, సొంత పార్టీ వారిని సైతం ఈ ముఠా బెదిరించి లొంగదీసుకుంనే పనులు చేసేది. సంధ్య సినిమా హాళ్ళ నిర్వాహకులు, కొందరు జువెలారీ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు పదేళ్ల ఎస్.ఓ.టి. ముఠా చేతుల్లో ప్రధాన బాధితులు. అందుకే ఇప్పుడు ఒకరొకరు బయటకు వచ్చి తమ గోడు వినిపిస్తున్నారు.
అదేవిధంగా కేసీఆర్ సోదరుని పుత్ర రత్నం కల్వకుంట్ల కన్నారావు కథ. పదేళ్ల కిందట భారాస అధికారం చేపట్టగానే నగర శివారులో కాన్నారావు దండాలు, సెటిల్మెంట్ ల “దుకాణం” తెరిచినట్టు ఆ పార్టీ నేతల ద్వారానే వెల్లడవుతోంది. మొన్నటి వరకు ఆయన ఇలాఖాలోకి వెళ్లాలంటే ముందుగా అడ్డుపడే జాగిలాలను దాట వలసి వచ్చేది. అధికారం తమదే కాబట్టి బెదిరిస్తూ, యదేచ్చగా “పనులు” ముగించే వారు. భారాస అధికారం కొల్పోగానే నేరాలు గుప్పుమంటున్నాయి. రెండు ఎకరాల భూ దందా కేసులో కన్నారావూ కటకటాల పాలయ్యారు. దీంతో మరికొంత మంది బాధితులు అధికారుల వద్దకు వెళ్ళి న్యాయం కోరుతున్నారు.
గత ప్రభుత్వంలో ఈ తరహా “దండుపాళ్యం” ముఠాల భాగోతం ఇలా ఉంటే వాళ్ళ నిజ స్వరూపం వెలుగు చూడడం కేసీఆర్, కేటిఆర్, హరీష్ వంటి భారాస అగ్ర నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే అయా లొసుగుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దంచి కొడుతున్న ఎండల్లో పంట పొలాల నీటి కోసం కేసీఆర్ పొలం బాట పట్టారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి వేశారు. ప్రభుత్వంపై ఏ వంకా దొరకక పోవడంతో ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పొలం గట్ల బాట వెతుకున్నారని అయన వ్యాఖ్యానించారు. ఇక కెటిఆర్ నేరుగా అధికార పక్షంతో పాటు మీడియా పై చిందులు వేస్తున్నారు. పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన కెటిఆర్ తనను విమర్శిస్తున్న నేతలపై, వెలుగు చూస్తున్న నిజాలను ప్రజలకు అందిస్తున్న ప్రసార సాధనాల పై పరువు నష్టం దావాలు వేస్తా అని బెదిరింపులకు దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజకీయ నేతగా పొగడ్తలు, విమర్శలను చాకచక్యంగా వ్యవహరించి తిప్పి కొట్టాలే గానీ పరువు పోయిందంటూ విరుచుకు పడడం విడ్డూరంగా ఉందని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు, జర్నలిస్టు సంఘాలు పేర్కొంటున్నాయి.