గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేసవి సెలవు దినాలలో ఆడుకోవడానికి, సేద తిరడానికి సాయం కాల సమయంలో గేమ్ జోన్ లోకి ఉల్లాసంగా వెళ్ళిన చిన్నారులు, వారి తల్లి దండ్రులు అగ్ని కీలలలో బూడిదగా మారారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి నడుపుతున్న రాజ్‌కోట్ లోని టి. ఆర్. పి. గేమింగ్ జోన్ శనివారం “డెత్ జోన్” గా మారింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో 35 మంది వరకు సజీవ దహనం అయ్యారు. అనేక మంది మంటలతో గాయాల పాలయ్యారు.
వినోదం కోసం గేమింగ్ జోన్ కు వచ్చిన పిల్లలు, వారి తల్లి దండ్రులు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా ఉంది. గేమింగ్ జోన్ లో క్షణాల్లో వ్యాపించిన మంటలకు పిల్లలు, పెద్ధలు అక్కడే ప్రాణాలు విడిచారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగైదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసికువచ్చారు. ఈ గేమింగ్ జోన్ పైకప్పు కట్టుదిట్టంగా లేకపోవడం వల్ల మంటల ధాటికి వెంటనే కుప్ప కూలిపోయింది. దీనివల్ల ప్రాణ నష్టం అధికంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ గేమింగ్ జోన్ ని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీని నిర్వహకుల్లో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం పై విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిశోధన బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.