ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు ఇచ్చిన “ఒక్క ఛాన్స్”ని ఐదేళ్ళ పాటు ఒంటెద్దు పోకడలతో చేజార్చుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ శ్రేణులతో జనంలోకి వెళ్ళలేని దుస్థితి నెలకొంది. అడ్డూ అదుపు లేని మాటలతో వైసీపీని రోడ్డున పడేసిన ఆ పార్టీ నాయకగణం ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు నుంచే తెర వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ప్రభుత్వ ఆగడాల పై “తవ్వకాలు” మొదలు పెట్టడంతో వైసీపీ వ్యవహారం “ఎర్త్” లేని వైరింగ్ తో “స్విచ్” లేని ఫ్యాన్ మాదిరిగా తయారైంది. ఇవే మాటలను కొందరు వైసీపీ నేతలే వెల్లడించడం గమనార్హం. ఇదంతా ఒకేత్తయితే పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.
“చెల్లి” బాటలో “అన్న”…?
తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు హడావిడి చేసి చివరకు చేతులెత్తేసి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే కాకుండా, ఆంధ్రా ఎన్నికల్లో మేకుగా అడ్డుపడ్డ సొంత చెల్లి షర్మిల బాట పట్టినట్టు సమాచారం. జగన్ బెంగుళూరులో అడుగు పెట్టగానే రకరకాల ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ఆయన కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్ తో భేటీ అయినట్టు, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలను షర్మిల చేతి నుంచి తొలగిస్తే వైసిపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశలో చర్చలు సాగినట్టు బలమైన ప్రచారం దుమారం రేపుతోంది. 150 సీట్ల నుంచి 11 సిట్లకే పరిమితం కావడం వల్ల రాజకీయ మనుగడ సాగించడం సాధ్యం కాదనే కోణంలో జగన్ కాంగ్రెస్ తో మైత్రి ఆలోచనలో అన్నట్టు తెలుస్తోంది. జగన్ ని ఇప్పటికే సిబిఐ, ఈ.డి. కేసులతో పాటు బాబాయి వివేకానంద రెడ్డి హత్య వ్యవహారం వెంటాడుతున్నాయి. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్నా, ముఖ్యమంత్రి బాధ్యతలు చూపి అయిదేళ్ళ పాటు కోర్టు వాదనలు, వాయిదాల నుంచి తప్పించుకున్నారు. కానీ, ఇప్పుడు పదవి పోవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ వ్యతిరేక పార్టీలే అధికారంలో ఉండడం జగన్ కి కునుకు లేకుండా చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. అంతేకాక, జగన్ బద్ధ శత్రువుగా భావించే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడమే కాక, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో చక్రం తిప్పే స్థితిలో ఉండడం కూడా జగన్ ని స్థిమితంగా ఉండనివడం లేదు. అందుకే ఎదైనా జాతీయ పార్టీ అండ ఉంటే తప్ప రాజకీయ మనుగడ పక్కన పెట్టి, ఎంతో కొంత వ్యక్తిగత ఊరట లభిస్తుందని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ కి బెంగుళూరు, అక్కడి నేతలతో గట్టి సంబంధాలు ఉండడం వల్ల పావులు కదపడానికి అక్కడి యలహంకలోని సొంత ప్యాలెస్ ని చర్చలకు వేదికగా మలచుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి తాజా ప్రతిపాదనకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయంలోనే జగన్ హైదారాబాద్ లోని చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీ జీవితం గడిపిన సంగతి కోస మెరుపు.