చరిత్ర లోనే రికార్డు - EAGLE NEWS

చరిత్ర లోనే రికార్డు

IMG 20240730 WA0012

స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి ఆయన అందజేశారు. మంగళ వారం మధ్యాహ్నం 12 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైనట్టు చెప్పారు.

IMG 20240730 WA0025

మాట ఇచ్చిన విధంగా ఆగస్టులోనే మూడో విడత చేపట్టి మొత్తం రూ.31వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేయలేదని, ఆ ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కడం గర్వంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడబోదని, అన్నదాతలు బాగుండాలన్నదే తమ విధానమని చెప్పారు. నాటి నెహ్రూ కాలం నుంచీ నేటి రాహుల్ గాంధీ తరం వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర పొడవునా రైతు పక్షపాతిగానే కొనసాగుతోందని గుర్తు చేశారు. తెలంగాణలో గత ప్రభుత్వం పదేండ్లలో పట్టుమని లక్ష రూపాయాల రుణమాఫీ కూడా సజావుగా చేయలేకపోయిందని, గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారాన్ని నిభాయిస్తూనే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ కోసం 12 రోజుల్లోనే రూ.12వేల కోట్లు సమకూర్చిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జులై 18న మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో రూ. 6034.96 కోట్లు జమకాగా, నేడు (జులై 30న) రెండవ విడతలో 6,40,223 మంది రైతుల ఖాతాల్లో రూ. 6190.01 కోట్లు జమ అవుతున్నాయి. ఆగస్టు పూర్తయ్యేలోపే చివరిదైన మూడవ విడతలో 17,75,235 మంది రైతుల ఖాతాల్లో రూ.12224.98 కోట్లు జమ చేయడంతో రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తికానుంది. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబాబు, దామోదర రాజనర్సింహ, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *