ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుంటారు. ఈ ధర్మ ప్రచార యాత్రలో పవన్ ఎక్కువ శాతం తమిళనాడు పైన మాత్రమే దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలోనూ పట్టు సాధించాలని సకల ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేనను పావుగా రంగంలోకి దించినట్టు సమాచారం. ఎందుకంటే, తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ దశాబ్ధాలుగా ప్రజల్లో పాతుకుపోయిన డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలకు ఏ జాతీయ పార్టీ అడ్డుకట్ట వేయలేక పోతోంది. పూర్తీగా భాష, ప్రాంతీయతకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే తమిళ ప్రజలు ఇతర పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

ప్యాన్ ఇండియా “రాజకీయం”..
అయితే, వివిధ రాష్ట్రాల్లో రకరకాల ఎత్తు గడలతో అధికార పీఠాలపై దండయాత్ర సాగిస్తున్న బిజెపి తమిళనాడులోనూ పాగా వేయడానికి శాయశక్తులు ఒడ్డుతోంది. ప్రధాన మంత్రి కూడా ఆ రాష్ట్రంలో పర్యటనలు జరపడం దీనికి ఒక నిదర్శనం. అక్కడ రానున్న ఎన్నికలలో ఎలాగైనా జండా పాతడానికి కమల దళం ఉవ్విళ్లూరుతోంది. అందులో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రపదేశ్ లో తమతో కలిసి వచ్చే పార్టీలైన తెలుగుదేశం, జనసేనలను వాడుకోవడానికి భాజపా అధినాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ద్వారా తమిళనాడు రాష్ట్రంలో ధర్మ ప్రచారానికి “క్లాప్” కొట్టింది. ఈ తెర వెనుక రాజకీయ రహస్యాన్ని జనసేన క్యాడర్ అంగీకరించక పోయినా భవిష్యత్తులో బయటపడక తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది శాసన సభ ఎన్నికలు పూర్తీ అయ్యే వరకూ విప్లవ నేత “చేగువేరా” భావాలను మాత్రమే అనుసరించిన పవన్, మంత్రి అయ్యాక ఒక్కసారిగా సనాతన పదాన్ని ఎత్తుకోవడమే భాజపాతో అంటకాగుతున్నారనడానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్ తమిళనాడులో సనాతన ధర్మంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చర్చలకు దారి తీసే అవకాశం ఉంది. గతంలో ఉదయనిధి మారన్, స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఇప్పుడు పవన్ ఆ రాష్ట్రంలోనే ఆలయాల సందర్శనకు వెళ్ళడం గమనార్హం. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు పూర్తీ భిన్నమైన సిద్ధాంతాలతో ఉండే బీజేపీ తమిళులకు ఎలా దగ్గరవుతుందనేది ఆసక్తికరమైన అంశం. ఎన్ని ఎత్తులు వేసినాగానీ బిజెపి తమిళ గడ్డపై తన భావజాలాన్ని చాటలేక పోతోంది.అందుకే పవన్ కల్యాణ్ ని కూడా అస్త్రంగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. పవన్ పర్యటన వల్ల ఏ మాత్రం పొగ రాజుకున్న మిగతా విషయాలను బిజెపి వ్యూహకర్తలు చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా సినిమా మాదిరిగా “ప్యాన్ ఇండియా రాజకీయం”లోకి దిగుతున్న పవర్ స్టార్ ఏ మేరకు హిట్టు కొట్టి పొలిటికల్ హీట్ పెంచుతారో వేచి చూడాలి.