ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ముసలం మొదలయిందా? ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య విభేదాల బీజం నాటుకుంటోందా? నేతల మధ్య బయటకు పొక్కని కుమ్ములాటలకు తెర లేచిందా? దక్షిణాదిలో ఆధిపత్యం కోసం ఆంధ్రా నేతలే పావులుగా బిజెపి చదరంగం సిద్ధం చేసిందా? జనసేన అధినేత వ్యవహార శైలిలో ఎందుకు మార్పు వచ్చింది? కీలకమైన మంత్రిత్వ శాఖను చేతిలో పెట్టుకున్న ఆయన రెండు మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? అనారోగ్యంతో ఉన్న ఆయన్ని ముఖ్యమంత్రి పలకరించే ప్రయత్నం చేసినా స్పందించ లేదా? ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులను బట్టి ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ అనేక ప్రశ్నలు, వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నిజంగా డిల్లీ పెద్దల ఆజ్యంతో పొగ రాజుకున్నట్టే అర్ధం అవుతోంది.

గత ఏడాది జూన్ 12 తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆ సభ ముగియగానే వేదికపై ఉన్న వారిని చంద్రబాబు పలకరిస్తుంటే, అదే సమయంలో వాహన శ్రేణి వైపు వెళ్తున్న ప్రధాని వద్దకు పవన్ కల్యాణ్ హడావిడిగా వెళ్ళడం కనిపించింది. ఈ సంఘటన తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు, కింది స్థాయి శ్రేణులకు సైతం మింగుడుపడ లేదు. మంత్రి వర్గంలో ఒకరిగా ప్రమాణం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాల్సింది పోయి ప్రధాని కదలిక పై దృష్టి సారించి ఆత్రంగా ఆయన్ని అనుసరించడం చంద్రబాబు నాయుడుకి కూడా తెలియనిది కాదు. అంతేకాదు, ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు కేటాయించిన తర్వాత పవన్ హావాభావాల్లోనూ, కార్యకలాపాల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పరిశీలకుల అంచనా. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రికి సైతం సమాచారం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని అధికారులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. దీనికి కాకినాడ పోర్టులో బియ్యం నౌక వ్యవహారం ఒక ఉదాహరణగా చూపుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన రెండు కీలకమైన మంత్రివర్గ సమావేశాలకు సైతం మంత్రిగా పవన్ హాజరు కాలేదు.

క్యాబినెట్ కి డుమ్మా..
క్యాబినెట్ లోనే కాదు, సచివాలయం లోనూ ఇదొక చర్చనీయాంశంగా మారింది. మొన్న జరిగిన సమావేశంలో పవన్ రాకపోవడంపై చంద్రబాబు నాదెళ్ళ మనోహర్ని ప్రశ్నించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అటవీ, గ్రామీణ నీటి సరఫరా వంటి కీలక శాఖలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ మంత్రుల సమావేశానికి రాకపోవడంపై చంద్రబాబు మరో కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన జనసేన అధినేత ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ఎక్కువగా కనిపించక పోవడం గమనార్హం. ఆరోగ్యం బాగాలేదని పత్రికా ప్రకటనలు జారీ చేస్తున్న ఆయన అదే సమయంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు వెళ్ళడం తాజాగా చర్చల్లో భాగమైంది. ఇలాంతాజా పరిస్థితులను టిడిపి నేతలు అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లలో జనసేన అభ్యర్థులు గెలవడానికి ఒకేఒక్క కారణం చంద్రబాబుపై పెల్లుబికిన సానుభూతి మాత్రమే అని నేటికీ టిడిపి వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దీనిపై అంతర్గత సర్వేలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. కానీ, జనసేన మాత్రం పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం తమ బలమే అనే ఆలోచంలో ఉండడం రానున్న రోజుల్లో అంతర్గత విబేధాలను అధికం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజకీయంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ, పరిపాలనలో కార్య నిర్వాహణ అధికారి (సిఇఓ)గా పేరున్న చంద్రబాబు సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియనివారు కాదని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా ఉన్న టీడీపీ, భాజపా, జనసేన పార్టీల్లో ఏ ఒక్కటి ప్రలోభాలకు లొంగినా, అధికారం కోసం ఎత్తులు వేసిన అనిశ్చితి తలెత్తకడం ఖాయం. చంద్రబాబు చాణక్యం ముందు ఎవరి పాచిక పారుతుందో వేచి చూడాలి.