పవన్ కల్యాణ్… ఇతను ఏదో సీదాసాదా సెలబ్రిటీ లేదా కేవలం సినిమా నటుడు మాత్రమే అయి ఉంటే “ఈగల్ న్యూస్” ఇలాంటి సమీక్ష (రివ్యూ) తన పాఠకులకు అందించేది కాదు. కానీ, పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రభావశీలి. ఆయన వ్యవహారం సామాన్య జనం పైన మాత్రమే కాదు రాజకీయాలు, పాలనా తీరుపై ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పవన్ కల్యాణ్ ఇటు ప్రజలకు, అటు రాజకీయ నాయకులకు దిమ్మ తిరిగేలా తనదైన శైలిలో దీపావళి పండుగ రోజు (అత్తారింటి దారి మూసివేత) అంటూ “కొత్త సినిమా” చూపించారు. ఒకరు కాదు ఇద్దరూ కాదు ఏకంగా మూడో భార్య నుంచి విడిపోతున్నట్టు సినిమా ఫక్కీలో ప్రకటన వదిలారు. ప్రజా జీవితంలో కీలక నేతగా చెప్పుకుంటూ, ఉప ముఖ్యమంత్రి హోదాలో పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా భార్య నుంచి విడిపోతున్నట్టు వెల్లడించడం తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరచింది. ఇకపై పవన్ నిర్ణయం రాజకీయాలపైనా, తను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ పైనా, అదీకాక ముఖ్యంగా ఆయన కొత్తగా ఎత్తుకున్న “సనాతన ధర్మ ప్రచారం” పైనా ఏ స్థాయిలో ప్రభావితం చూపుతాయనే విశ్లేషణ కోసమే “ఈగల్ న్యూస్” ఈ కథనాన్ని అందిస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు 30 ఏళ్లుగా వెండితెరపై కనువిందు చేస్తున్న నటుడు పవన్ కల్యాణ్. ఎంతో సౌమ్యంగా ఉండే చిరంజీవికి సోదరుడు అయినప్పటికీ పవన్ లో దూకుడు ఎక్కువ. ఈ సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియని విషయం కాదు. తెరపై కనిపించే పవన్ కి, తెర వెనుక ఆయన జీవితం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ విషయం 2008వ సంవత్సరంలో మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చినప్పుడు బయట పడింది. ఆ తర్వాత రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకొని మూడేళ్లకే ఆమెతో విడిపోయారు. కొంత కాలానికి అన్నా లెజినోవాని వివాహం ఆడి 13 ఏళ్ల కాపురానికి మొన్న తెగదెంపులు ఇచ్చారు. మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అప్పుడు ఆయన కేవలం ఒక నటుడు కాబట్టి జనానికి ఆ విషయం అవసరం కూడా లేదు. సినీ రంగంలో అలాంటి బంధాలు సహజం అనే భావనతో పవన్ రెండో పెళ్లి తంతుని అభిమానులు ఒక సినిమాగా చూశారు. కొన్నేళ్ల తర్వాత రేణు దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చి రష్యాకు చెందిన గ్రూప్ డ్యాన్సర్ అన్నా లెజినోవాను 2013లో మూడో పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా తెలుగు ప్రజలు తేలికగా తీసుకున్నారు. అది పవన్ వ్యక్తిగత జీవితంగా కొట్టి పారేశారు. ఆయన సినిమాలను చూసి ఆనంద పడేవారు తప్ప పెళ్లి, పెటాకుల ముచ్చట మనకెందుకనే వారు.

కానీ, ఇదే రష్యా యువతి వివాహ వ్యవహారం 2014వ సంవత్సరం తర్వాత పవన్ పై ప్రభావం చూపడానికి నాంది పలికింది. ఆ ఏడాది మార్చి 14వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పవన్ నేతృత్వాన జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత కొన్ని నెలలకే రాష్ట్రాలు విడిపోవడం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, అటు వైసీపీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా రాజకీయ తెరపైకి రావడంతో జనసేన ఇరకాటంలో పడింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసే సాహసం కూడా చేయకపోవడం గమనార్హం. పవన్ పార్టీ పెట్టడంతోనే రాజకీయంగా మూడు పెళ్లిళ్ల వ్యవహారం క్రమంగా ప్రచారంలోకి వచ్చింది. 2019 సంవత్సరం సాధారణ ఎన్నికల నాటికి జనసేనకు పవన్ పెళ్లిళ్ల తంతు తీవ్ర స్థితికి చేరింది. అందుకే పవన్ కూడా తన మూడు పెళ్లిళ్ల పై ఘాటుగా స్పందించే వారు. వైసీపీ ఆరోపణల పట్ల అసహనానికి గురైన పవన్ ఒక సందర్భంలో “నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్” అంటూ మాట్లాడే వారు. అంటే పవన్ మొదటి రెండు పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఎంత మాత్రం పట్టించుకొని ప్రజలు, రాజకీయ పార్టీలు ఆయన ప్రజా జీవితంలోకి అడుగు పెట్టగానే మూడో పెళ్లిని రాజకీయ ఎజెండాలో చేర్చడం ప్రధాన అంశం. అంటే తెరపై ఎన్ని కథలైనా చూపించండి గానీ ప్రజల మధ్య నీతులు చెప్పుకుంటూ తిరుగుతూ ఆ నీతిని పాటించకపోవడం తప్పు అనేది విమర్శల అర్ధం.
ఇదిలా ఉంటే, ప్రజా సేవ కోసం అంటూ రాజకీయ చదరంగంపై జనసేన పార్టీ అనే పావును నిలిపిన పవన్ కల్యాణ్ ఏదో ఒక అధికారం దక్కించుకు నేందుకు నానా తంటాలు పడ్డ విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఆంధ్రాలో అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష తెలుగుదేశం పార్టీల హోరాహోరు మధ్య దిక్కుతోచని స్థితిలో ఉన్న జనసేన తెలివిగా చంద్రబాబు నాయుడు అరెస్టును అవకాశంగా తీసుకుంది. బాబు, బీజేపీల బలం ఆసరాగా చేసుకొని సీట్లు కైవసం చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి గా పవన్ పదవి దక్కించుకున్నారు. అయితే, మొన్న అన్నా లెజినోవాతో విడిపోతున్నట్టు ప్రకటించడం సామాన్య ప్రజల్లోనే కాదు, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చగా మారింది. గత ఎన్నికల్లోనూ, ఎన్నికల తర్వాత కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మహిళల పట్ల చూపిన ప్రేమ, అభిమానాలు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. భార్యతో విడిపోవడం అంటే సినిమాల్లో మాదిరిగా రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయం కాదు. దానికి బలమైన కారణాలు ఉంటాయి, ఏళ్ల తరబడి ఇద్దరి మధ్య విబేధాలు, ఘర్షణలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు, మహిళా సంఘాలు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
అత్తారింటికి దారి… కృష్ణా తీరం..!
అంటే, పవన్ గత శాసన సభ ఎన్నికల ప్రచారంలో ఆవేశ పడ్డ తీరుని గుర్తు చేసుకుంటే అప్పట్లోనే ఆయన వ్యక్తిగత సంఘర్షణలో ఉన్నట్టు భావించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. మంత్రిగా మారిన తర్వాత భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతూ తన పార్టీ సిద్ధాంతాన్ని, ఎజెండాను మార్చడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఒకవైపు నాతన ధర్మం అంటూ తిరుగుతూ మరోవైపు భార్యలకు విడాకులు ఇవ్వడం అంతుపట్టని రాజకీయంగా పలువురు అభిప్రాయ పడుతున్నారు. భార్యలను వదిలించుకోవాలని ఏ సనాతన ధర్మం చెబుతోందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం తెరపైకి వస్తున్న నాలుగో పెళ్లి ఎత్తుగడలపై కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనతో ఆరేళ్లుగా అత్యంత సన్నితంగా ఉంటున్న కృష్ణా జిల్లా కు చెందిన రుక్మిణి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. ఈమె మూలంగానే పవన్, అన్నా కు మధ్య వివాదం తలెత్తిందని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ వ్యవహారాలను మాత్రమే కాక, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా అన్నీ రుక్మిణి దగ్గరుండి చూసుకునేదని పార్టీ వర్గాల ద్వారానే గుప్పుమంటోంది. రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో 2020లో జనసేన పార్టీలో చేరిన ఆమెకు పవన్ కల్యాణ్ ‘జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ ఛైర్మన్’ పదవిని కట్టబెట్టారు. 2022లో ఆమె తన నివాసాన్ని లండన్ నుంచి హైదరాబాద్కు మార్చుకుని పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
ఈ విషయం ఎంత వరకు వాస్తవం అనేది పవన్ స్వయంగా వెల్లడిస్తే తప్ప తెలియదు. అయితే, ప్రస్తుతం రకరకాల సిద్ధాంతాలు, జీవిత పరమార్థాలు చెబుతూ, సనాతన ధర్మమే పరమావధిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో జనం మధ్య తిరుగుతున్న పవన్ నాలుగో పెళ్లికి సాహసిస్తాడా అనేది సర్వత్ర ఆసక్తిదాయకం. ప్రస్తుతం ఆయన కొత్త సినిమా కోసం కంటే కొత్త భార్య ఎవరనే అంశం పైనే అభిమానుల మధ్య చర్చలు సాగుతున్నాయి.
