ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసలు ఏం చేయలనుకుంటుందో తెలియని అయోమయం…. మరోవైపు ఈ సమయంలో చురుకుగా వ్యవహరించాల్సిన హౌసింగ్ సొసైటీ నత్త నడక పనులు…సమస్య పరిష్కారానికి సరైన ప్రయత్నాలు చేయకపోవడం ఇవ్వన్నీ కలిసి సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల్లోనే జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ సభ్యుల మధ్య అగాధం పెరగడానికి దారి తీస్తోంది. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య సమన్వయ కర్తగా ఉండాల్సిన మీడియా అకాడమీ సైతం ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతుందో బాహ్య ప్రపంచానికి తెలియక పోవడం పట్ల జర్నలిస్టులు ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు సుప్రీం కోర్టులో ఉన్న కేసును బూచిగా చూపి, తీరా జర్నలిస్టుల స్థలాన్ని వారికే ఇవ్వండని దేశ అత్యున్నత న్యాయస్థానమే తీర్పు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఆ దిశలో ఎలాంటి స్పందన లేదు. సాధారణంగా ఏదైనా కేసుపై కోర్టులు తీర్పు ఇస్తే దాన్ని వెంటనే అమలు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వ అధికారులపై ఉంటుంది. కానీ, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీకి ప్రభుత్వమే కేటాయించిన భూమిని వారికి అప్పజెప్పడానికి అధికార్లు సాహసించడం లేదు. సొసైటీ నేతలు గానీ, సభ్యులుగానీ అధికారులను కలిసి స్థలం బదలాయింపుపై అధికారులను అడిగితే “అక్కడి” నుంచి క్లియరెన్స్ రావాలని చేతులెత్తేయడం అనుమానాలకు దరి తీస్తోంది. దాదాపు 16 ఏళ్ల కిందట అతి కష్టం మీద డబ్బు చెల్లించి కొనుక్కున్న స్థలాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారని సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే హౌసింగ్ సొసైటీ స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నాలుగైదు నెలలుగా సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకునిరెత్తినట్టు వ్యవహరించడం వివాదాలకు దారి తీస్తోంది. తీర్పు వచ్చిననాటి నుంచి సొసైటీ తరఫున ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన ఏలాంటి స్పందన కనిపించలేదు. దీంతో సొసైటీకి చెందిన పేట్ బషీరా బాద్ స్థలాన్ని కాపాడుకోవడానికి కొందరు సభ్యులు టీమ్ గా ఏర్పడి అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తాము చేస్తున్న నిరసన కేవలం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించు కోవడానికి మాత్రమే అని టీమ్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. తీర్పు వెలువడి ఏడాది కావస్తున్నా ఈ స్థలం విషయంలో ఏ ఒక్కరూ సరైన హామీ గానీ, ప్రకటన గానీ ఇవ్వక పోవడం ఆందోళనకు గురిచేస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి కెసిఆర్ పై సొసైటీ సభ్యులు కొంత నమ్మకంతో ఉన్నారు. గతంలో ఒకసారి బషీరా బాద్ స్థలంలో ఐ.టి. పార్కు నిర్మాణానికి ప్రయత్నాలు జరిగినప్పుడు స్వయంగా మంత్రి కేటిఅర్ జోక్యం చేసుకొని రాత్రికి రాత్రే ఆ ప్రయత్నాలను ఆపి వేయించారు. అంతేకాక, మొన్న అసెంబ్లీ సమావేశాలలోనూ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల విషయాన్ని తీర్పు సమయంలో ముఖ్యమంత్రి దాదాపు పదిసార్లు జస్టిస్ రమణతో మాట్లాడారని, ఇస్తామని వెల్లడించారు. ఈ మాటలను కూడా జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ ఒక భరోసాగా తిసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్ లోని కొత్త జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయం పై నిర్ణయం తీసుకోని వాళ్ళతో ప్రమేయం లేకుండా ఎప్పుడో కొనుగోలు చేసిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ స్థలాలను వెంటనే సొసైటికి అప్పజెప్పాలని జర్నలిస్టులు , జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.