ఇక రక్షణ చర్యలు…

IMG 20230814 WA0001

తిరుమల వెళ్ళే కాలినడక మార్గంలో పిల్లల పై చిరుత పులుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్‌ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్యాగ్‌ పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, పోలీసు టోల్‌ ఫ్రీ నంబర్‌ పొందుపరుస్తున్నారు.

వన్యప్రాణులు రాకుండా లైటింగ్, సౌండ్‌ సిస్టమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలేనికి చెందిన బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడంతో తితిదే ఈ మేరకు రక్షణ చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన చిరుతను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేసింది. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకొనేలా చైతన్యపరుస్తోంది. క్రూర మృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు భక్తులు సహకారం అందించాలని తితిదే కోరింది. అలాగే నడకదారి మార్గంలో అడవి మృగాలు సంచరించే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వన్యమృగాలు నడకదారి దగ్గరకు రాకుండా ఉండేందుకు అవసరమైన సెంట్రీ పోస్టులు, సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *