అతిక్రమిస్తే ఉక్కు పాదం…!

evm

వచ్చే ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలలో స్వల్ప మార్పు చేసింది. ఈవీఎంపై గతంలో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే  ఉండేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పైనా అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా మార్పునకు చేసే దరఖాస్తులను నిలిపి వేసినట్టు,  ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ పథకాలకు నిబంధనలు గతంలో ఎలా ఉన్నాయో అలానే అమలవుతాయన్నారు. నూతన పథకాలను ప్రకటించాలంటే ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్న రాజకీయ నాయకుల ఫొటోలను తక్షణం తొలగించాలని, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు శబ్దాలు నిలిపివేయాలని సూచించారు.

vikas raj in

సరైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తీసుకెళుతూ పట్టుపడితే ఆ మొత్తాన్ని సీజ్‌ చేస్తారని, ధ్రువపత్రాలుంటే వాటిని సరిచూసి అధికారులు విడుదల చేస్తారన్నారు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిందని, వివిధ అవసరాలకు డబ్బును తీసుకెళ్లాలని నిర్ణయించిన పక్షంలో ముందస్తుగా అనుమతి తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు, ఆన్‌లైన్‌ ద్వారా ఆయా వివరాలను అధికారులు పరిశీలిస్తారని వికాస్‌రాజ్‌ వివరించారు.

అన్ని పోలింగు కేంద్రాల్లో బ్రెయిలీ లిపిలో డమ్మీ బ్యాలెట్‌ పత్రాలు, దివ్యాంగులు, వృద్ధులకు సహాయకంగా వాలంటీర్లను, చక్రాల కుర్చీలు  అందుబాటులో ఉంటాయని,  ర్యాంప్‌లనూ ఏర్పాటు చేసినట్టు వికాస్ తెలిపారు. దివ్యాంగులు ముందుగా యాప్‌లో పేరు నమోదు చేసుకుంటే రవాణా సదుపాయమూ కల్పిస్తున్నట్టు, అన్ని పోలింగు కేంద్రాల్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు, సమస్యాత్మక పోలింగు కేంద్రాల గుర్తింపు ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు 1950 నంబరు  అందుబాటులో ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సందర్భంగా ఇచ్చే అఫిడవిట్లలో ఏవైనా ఖాళీలు ఉంటే ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేస్తారని, వాటికి నిర్దిష్ట వ్యవధిలోగా సవరణ అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే నామినేషన్‌పత్రాలను తిరస్కరిస్తామని, మద్యం దుకాణాలు నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే వాటిని మూసివేస్తామని వికాస్‌రాజ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *