రాష్ట్రంలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని, దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం, కానీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్, కేసీఆర్ ఓటమి ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందనీ, బీఆర్‍ఎస్ అవినీతితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే, మజ్లీస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీ పెట్టి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్‍ఎస్ మద్దతు తెలిపిందనీ, రైతు చట్టాలకు కూడా బీఆర్‍ఎస్ మద్దతు తెలిపడం విచారకరమన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందనీ, దేశంలో ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్‍ను నియంత్రిస్తున్నారనీ, పరిపాలనలో అందరినీ భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. అదానీ లక్షల కోట్ల రూపాయల అప్పులను బీజేపీ మాఫీ చేస్తోంది కానీ, మహిళా రుణాలను మాత్రం బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదన్నారు. ప్రజలుకొనుగోలు చేసే ప్రతి వస్తువుపై బీజేపీ జీఎస్టీ వసూలు చేసి అదానీకి కట్టబెడుతున్నారు. కేసీఆర్ కుటుంబం సంపదను ఎలా దోచుకుందో ప్రజల ముందు ఉంచుతామనీ, తెలంగాణలో పేదల, రైతుల సర్కార్‍ను ఏర్పాటు చేస్తామని కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.