భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో ఎన్నికల భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షణ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల కు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సభకు వస్తారని తెలిపారు. 24 ప్రాంతాలలో పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దామని చెప్పారు. GO 58, 59 ల క్రింద నగరంలో వేలాదిమందికి ఇంటి స్థలాలను రెగ్యులరైజేషన్ చేశామని తెలిపారు. సొంత ఇల్లు లేని సుమారు 70 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేశామని చెప్పారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తామని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాద్యతలు చేపడతారని జోస్యం చెప్పారు.