పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే అందర్ని రోడ్డునపడేసి నట్టేట ముంచుతాడని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పసుపులేటి సందీప్,జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త పసుపులేటి పద్మావతిలు ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వారు వైయస్సార్ సిపిలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైఖరిపై పలు ప్రశ్నలు కురిపించారు. అందర్ని ప్రశ్నిస్తానని,రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పే పవన్ లో నిలకడలేదని, ధైర్యం ఉంటే తాము అడుగుతున్నప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పవన్ ని నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న నేను గల్లీకి కూడా కాకుండా పోయానని, పార్టీ కేంద్ర కార్యాలయంలో కోట రుక్మిణి అనే మహిళ మాట మీద నన్ను మా అమ్మ(పసుపులేటి పద్మావతి)ను పవన్ కళ్యాణ్ రోడ్డుకీడ్చారని సందీప్ వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ కు చిత్తశుద్ధి లేదని, పవన్ కళ్యాణ్ కి రుక్మిణి అంటే భయమని,పవన్ కళ్యాణ్ అహంకారని, తను లేకుండా మనోహర్ కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటాడని దుయ్యబట్టారు.హైదరాబాదు లో భూకబ్జా లో ఉన్నవ్యక్తిని పార్టీ కమిటీలో తీసుకున్టినారని, టిడిపి కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ ఏపీ రాజకీయాల్లో మాట తప్పాడని, పవన్ ను ప్రజలు ఓడించినా ఎందుకు పోటీ చేస్తున్నాడని ప్రశ్నించారు. పవన్ టిడిపి పంచన చేరి కార్యకర్తలను మోసం చేసాడని, పవన్ కు కాపులు కావాలనుకుంటే ఆయనే ముందు పెద్దన్న పాత్ర వహించాలని అన్నారు. రాయలసీమలో బలిజల్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు.
జనసేన రాయలసీమ కన్వీనర్ గా గతంలో పనిచేసిన పసుపులేటి పద్మావతి మాట్లాడుతూ 2009 నుంచి చిరంజీవి అభిమానిగా ప్రజారాజ్యాంతో రాజకీయాల్లోకి వచ్చాను. 2014లో జనసేనకు అండగా నిలబడ్డాను.పవన్ ను నమ్మి ఆయన చెప్పిన మాటలు విని సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న నా బిడ్డను ఆయన దగ్గరకు పంపితే ఈ రోజు రోడ్డున పడేసి చాలా గొప్ప బహుమతి ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.పవన్ ను నమ్మి యువతను ఎవ్వరూ పవన్ వద్దకు పంపద్దని, పవన్ మాట తప్పి బయటకు పంపే నాయకుడని, నాదెండ్ల మనోహర్ మహిళలను అనచివేస్తారని ఆరోపించారు. మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదన్నారు.తెలుగుదేశం,జనసేన కలవడాన్ని జనసైనికులు ఎవ్వరూ అంగీకరించడం లేదని ఆమె అన్నారు.అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారని అన్నారన్నారు.