KHAMMAM

ఖమ్మం జిల్లా చరిత్ర

ఉద్యమాల గుమ్మం ….ఖమ్మంగా పేరొందిన ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉంది. తెలంగాణాలో చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.  ఖమ్మం పట్టణంలో  నరసింహా స్వామి కొలువై ఉండడం వల్ల  కాలక్రమేణా అది స్థంభ శిఖరిగాను ఆపై స్థంబాధ్రిగా పిలువబడినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ఉర్దులో  “కంబ” అంటే రాతి స్తంభం కావున ఖమ్మం అనే  పేరు ఆ పట్టణంలో ఉన్న రాతి శిఖరం (ఖిల్లా) నుండి వచ్చినట్టుగా మరొక వాదన ఉంది.  ఖమ్మంలో కొలువుదీరిన నరసింహాలయం త్రేతాయుగం  నాటిదని నమ్ముతారు. బొగ్గు గనులకు పుట్టినిల్లయిన  కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి.

Khammam Bhadrachalam

వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా 1953వ సంవత్సరంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, అశ్వారావుపేట, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి 1959వ సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో కలిపారు. అయితే 2014వ సంవత్సరంలో  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణం కోసం భద్రాచలం పట్టణం, మండల కేంద్రం మినహా ఆ మండలంలోని అన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం   డివిజన్ లో కలిపారు. నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. ఈ జిల్లాలోని భూములు వ్యవసాయానికి అనువైనవి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది.  మిరప, పొగాకు, మామిడి, అరటి, ముంతమామిడి, కొబ్బరి, పామ్ అయిల్, కోకో, వరి, మిరియాలు  పండిస్తారు.  ఖమ్మం జిల్లాలో మొత్తం నాలుగు మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. పాలేరు, వైరా, తాలిపేరు, కిన్నెరసాని, లంకాసాగర్ వంటి నీటి ప్రాజెక్టులు తాగునీరు, వ్యవసాయ పనుల అవసరాలు తీరుస్తున్నాయి.

Khammam ktps

విభజన తర్వాత..

తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడిన తరువాత  2016 సంవత్సరంలో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టింది. విభజనకు ముందు  ఖమ్మం జిల్లా లోని 46 మండలాలలో 5 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో విలీనంచేయగా 41 పాత మండలాలలో నుంచి 17 మండలాలను విదదీసి  కొత్తగూడెం పరిపాలనాకేంద్రంగా భద్రాద్రి కొత్త గూడెం  జిల్లాగా ఏర్పాటు చేశారు.

పర్యాటకం

జిల్లాలో కిన్నెరసాని, పర్ణశాల, పాపికొండలు వంటి పర్యాటక ప్రదేశాలు మంచి ఆహ్లాదాన్నిఇస్తాయి. ఇక భద్రాద్రీశుడైనా రాముల వారు జిల్లాకు కులడైవంగా చెప్పవచ్చు. ఏటా ఇక్కడ జరిగే సీతా రాముల కళ్యాణ ఉత్సవం జగత్ విదితం. ఇల్లందు, కొత్త గూడెం, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాల్లో విస్తరించిన దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి.