బెల్లం కొట్టిన రాయి“అల్లం”…!

allam

పాత్రికేయ రంగంలో విలువలను పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటైన తెలంగాణ  ప్రెస్ అకాడమీ (ప్రస్తుత మీడియా అకాడమీ) గత పదేళ్లుగా పాలకుల మడుగులోత్తే అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. జర్నలిజాన్ని, పాత్రికేయులను ప్రోత్సహిస్తూ కమ్యూనికేషన్, మీడియా ద్వారా సమాజానికి సహాయపడే విధంగా పనిచేయాల్సిన అకాడమీ దశాబ్ద కాలంగా నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరించిందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విలువలతో పని చేసిన ప్రెస్ అకాడమీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తన ప్రాభవం కోల్పోయింది. మీడియా అకాడమీగా పేరుమార్చుకొని పాత్రికేయులకు, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచి పోయిందనే వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి. జర్నలిస్టుల సమస్యలను గత ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడంలో అకాడమీ పూర్తిగా వైఫల్యం చెందిందని సీనియన్ పాత్రికేయులు, కొందరు పాత్రికేయ సంఘాల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రెస్ అకాడమీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ మీడియా అకాడమీల పనితీరు, దానికున్న విలువలను ఒకసారి పరిశీలిస్తే వ్యత్యాసం ఇట్టే స్పష్టం అవుతుంది.

నల్గొండ జిల్లా సూర్యపేటలో 1992 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే తీర్మానాన్ని అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి  అంగీకరించారు. సియాసత్ సంపాదకులు అబిద్ ఆలీ ఖాన్ నాయకత్వంలో ఏర్పాటైన  కమిటీ కర్ణాటక, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో  ప్రెస్ అకాడమీల పనితీరుని పరిశీలించి సమర్పించిన నివేదిక అధారంగా 1996 మార్చి 19 తేదీన కె. శ్రీనివాసరెడ్డి ప్రెస్ అధ్యక్షునిగా తొలి పాలకమండలి సమావేశం జరిగింది.  అకాడమీని 1996 జులై 20 వ తేదిన అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. 1996 ఫిభ్రవరి 22 వ తేదీ  నుంచి 1998 ఫిభ్రవరి 21వరకు కె.శ్రీనివాసరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా భాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు పొందుతున్నప్పటికీ , ఛైర్మన్ నియమాకం మినహా అకాడమీని  స్వయంపాలక సంస్థగా తీర్చిదిద్దారు.. 1999 ఫిభ్రవరి 12వ తేదీ నుంచి  2002 మే 2 వరకు పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. ఈయన హయాంలోనే వివిధ గ్రంధాలయలోని పాత పత్రికల డిజిటలీకరణ రూపుదిద్దుకుంది. ఆ తర్వాత దేవులపల్లి అమర్ బాధ్యతలు చేపట్టి తనదైన తరహాలో అకాడమీ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను ఒకచోటకు చేర్చి శిక్షణ తరగతులు , కర్యాశాలలు, పలురకాల పోటీలు నిర్వహించడం వంటి సందడి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రెస్ అకాడమీలో నిత్యం కనిపించేది.

jnj nizmpt 2

అయితే, రాష్ట్రం విడిపోవడంతో  గంపెడు ఆశల ఎరా చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కొత్త అకాడమీని ఏర్పాటు చేసింది. 2014 జూలై 14వ తేదీన తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ గా అల్లం నారాయణ నియమితులయ్యారు. మొన్నటి వరకు ఏలిన “ఒంటెద్దు పోకడ” ప్రభుత్వ ముఖ్యమంత్రితో సమానంగా  2014 సంవత్సరం నుంచి నిన్నటి వరకు అల్లం నారాయణ మాత్రమే  ఛైర్మన్ గా చెలామణి అయ్యారు. మొదట నారాయణ పదవీకాలం 2016 జూలై 13తో ముగియడంతో ప్రభుత్వం దాన్నికాస్తా 2019 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ  2022 జూన్ 30వ తేదీతో ముగిసిన ఈ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. 2022, జులై 1 నుంచి 2024 జూన్ 30 వ‌ర‌కు మీడియా అకాడమీ చైర్మన్‌గా పదవిలో కొనసాగేలా ప్లాన్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చివరి వరకు అల్లం నారాయణను వదిలి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో అనుభవం, సమర్ధవంతమైన ఉన్న అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా అల్లం నారాయణను మాత్రమే ఎందుకు ఛైర్మన్ గా చేస్తున్నారనే భావన కలిగినా  గత ప్రభుత్వ పోకడ వల్ల ఏ ఒక్కరు ప్రశ్నించ లేదు. ప్రభుత్వ నిర్ణయాలు, సమావేశాల్లో  పాల్గొనడం తప్పితే జర్నలిస్టులకు సంబధించిన ఈ ఒక్క సమస్యను, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలను నోరు విప్పిప్రభుత్వానికి చెప్పిన దాఖలాలు లేవనే అపవాద ఇప్పుడు అల్లం నారాయణకు చుట్టుకుంది. కెసిఆర్ జర్నలిస్టులను అనేక సార్లు చులకన చేసి మాట్లాడినా, ప్రగతి భవన్ లో నిర్వహించిన సమావేశాల్లో విలేకరులను పేర్లు పెట్టి మరీ అవమానించినా మీడియా పెద్దగా ఏ ఒక్కసారి అది తప్పని చెప్పక పోవడం అల్లం నారాయణ “భక్తి” నిదర్శమనే విమర్శలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. హైదరాబాదు జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల విషయంలో ప్రభుత్వంతో కలిసిపోయి తన మౌనంతో పాత్రికేయులకు తీరని నష్టం చేశారనే అపవాదు కూడా అల్లం మూటగట్టుకోవడం గమనార్హం. ఎప్పుడో 17 సంవత్సరాల కిందట జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి  అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ళ స్థలాలకు సంబందించి తలెత్తిన సమస్యలను గత ఏడాది సుప్రీం కోర్టు ధర్మాసనం పరిష్కరించి స్థలాలను వారికే అప్పజెప్పాలని తీర్పు ఇచ్చినా దాన్ని ప్రభుత్వం పూచిక పుల్ల మాదిరిగా పక్కన పెట్టింది. తీర్పును అమలు చేయాలని కోరుతూ సొసైటీ సభ్యులు ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేసినా “ఒంటెద్దు” ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ, బాధ్యత గల పదవిలో ఉండి, జర్నలిస్టులకు సాయం చేయాల్సిన మీడియా అకాడమీ ఛైర్మన్ సైతం తీర్పును అమలు చేయించే ప్రయత్నం చేయకపోవడం అప్పట్లోనే విమర్శలకు దారి తీసింది. ఇదేకాకా, 2018 వ సంవత్సరం ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని జర్నలిస్టుల అందరికి ఇళ్ళ స్థలాలు ఇస్తుందని, దానికి అవసరమైన భూములు చూడాలని ఆల్లం నారాయణను ఆదేశించారు. అప్పట్లో ఓ బృందం హడావిడిగా కొంగర్ కలాన్, బుద్వేల్ ప్రాంతాల్లో స్థలాలు చూసింది. కానీ, ఎన్నికలు పూర్తీ అయ్యాక ఈ భూములను ఇతర ప్రైవేటు సంస్థలకు కేటాయించి జర్నలిస్టులకు స్థలాన వ్యవహారం కేవలం ఎన్నికల డ్రామా అంటూ చేతులెత్తారు. ఈ విషయంలో కూడా అకాడమీ దిష్టిబొమ్మ నీతిని గుర్తుచేసింది.

pres acadmy

మీడియా అకాడమీ వైఫల్యానికి మరో నిలువెత్తు నిదర్శనం అకాడమీ భవన ప్రారంభోత్సవం. 2015 ఫిబ్రవరిలో హైదరాబాదు నాంపల్లి ప్రాంతం  ఛాపల్ రోడ్డులోని పాత  ప్రెస్అకాడమీ భవనంలో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడే  కొత్త భవనం నిర్మించాలని సూచించారు. భవన నిర్మాణంకోసం 2017లో 15 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వేయి గజాల స్థలంలో,  నాలుగు అంతస్తుల్లో  29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా, 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులతో నిర్మించారు. ఈ ఎన్నికల ముందే ఆ భవనం ప్రారంభం కావలసి ఉండి. కెసిఆర్ చేతుల మీదుగా అకాడమీ భవనం ప్రారంభమవుతుందని ఎన్నికల నోటిపికేషన్ రాకముందు అందరూ ఉహించారు. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత అర్హులైన జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల గురించి ఆలోచించారో లేక, సుప్రీం కోర్టు తీర్పులు అమలు చేయాలనే ఉద్దేశ్యం లేకనో కానీ ఎలాంటి ప్రకటనా చేయడానికి ఇష్టపడని కెసిఆర్ చివరికి మీడియా అకాడమీ భవనం ఛాయాలోకి కూడా రాలేదు. దీంతో ఆ భవనం కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. పత్రికా రంగంలో ఎంతో అనుభవం ఉన్న అల్లం నారాయణ నేడు విమర్శలు ఎదుర్కోవడం నిజంగా గత ప్రభుత్వ “ఒంటెద్దు పోకడ”లే కారణంగా మరికొందరు జర్నలిస్టులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *