ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆళ్ళ అసంతృప్తితో ఉన్నారు. అలాగే రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి భావిస్తున్నారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల పోటాపోటీగా కార్యాలయాలు సైతం ఓపెన్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా వేమారెడ్డి కార్యాలయం ప్రారంభించడం చర్చకు దారి తీసింది.