తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో కొన్నేళ్ళుగా తెగిపోయిన సంబంధాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన “ఒంటెద్దు” ప్రభుత్వంలో తానే అన్నీ అన్నట్టు వ్యవహరించి చివరకు రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని సైతం లెక్క చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలన పరంగా చేయాల్సిన పనులను కూడా వ్యక్తిగతంగా తీసుకోవడంతో కొన్నేళ్ళుగా నిధులు అందకుండా పోయాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేత కేంద్రంలోని ప్రధాని, వివిధ శాఖల మంత్రులుతో ఆచితూచి వ్యవహరించాల్సిన లౌక్యాన్ని పక్కన పెట్టి వారిని శత్రువులుగా,దేశంలో తెలంగాణ ఒక్కటే తన సొంత జాగీరుగా భావించడంతో కేంద్ర నిధులు చేజారాయి. కేంద్ర మంత్రులను, అక్కడి అధికారులను పూచిక పుల్ల మాదిరిగా చూడడం తెలంగాణ ప్రజలకు సంకటంగా మారింది. కేంద్ర సాయమే అవసరం లేదన్నట్టు వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధి ముసుగులో కాకి లెక్కలు చూపుతూ గుట్టు చప్పుడు కాకుండా లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టడం బిఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏ ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దశాబ్ద కాలంగా సాగిన నియంతృత్వ పాలన వల్ల తెలంగాణ ప్రజలు తీరని నష్టానికి గురికావలసి వచ్చిందని పలువుర పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పోరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడి తెలుగుదేశం, జనసేనలతో కలిసి పోటీ చేసినప్పటికీ అనూహ్య విజయం సాధించిన వైసిపి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నడూ కేంద్రంతో విభేదించకపోవడం గమనించాల్సిన విషయమని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. జగన్ కొనసతిస్తున్న సత్సంబంధాల వల్ల ఆ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, నిధులు వచ్చాయని చెబుతున్నారు. అయితే, కొన్నేళ్ళుగా బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంబధాలు అవసరం లేనట్టు వ్యవహరించడం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒంట్టేత్తు పోకడలను అవలంభించడం వల్ల రాజకీయ సమీకరణలు, పంతాలు ఎలా ఉన్నా నిధుల విషయంలో మాత్రం తీరని నష్టం జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు వెల్లడించిన అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించాయి. అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే ఏటా తెలంగాణకు సైతం కేంద్రం నుంచి గ్రాంట్లు, ఇతర రూపాల్లో రావలసిన నిధులు బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అక్కడే ఉండి పోయాయి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావలసిన సుమారు 1800 కోట్ల రూపాయల నిధులు అడిగే దిక్కు లేక కేంద్ర ఖజానలోనే మూలిగే పరిస్థితి దాపురించింది. అదేవిధంగా 2700 రూపాయల వివిధ రకాల గ్రాంట్లు రాష్ట్రానికి “దొర’ నిర్లక్ష్యం పుణ్యమా అని తెలంగాణ ప్రజలకు దక్కలేదు. దీన్నిబట్టి చూస్తే సుమారు 4500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం వద్దే నిలిచిపోయినట్టు స్పష్టం అవుతోంది. మొన్న రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి చేసిన విజ్ఞప్తిలో ఈ విషయం వెల్లడికావడం గమనార్హం. ఈ వివరాలు బయటకు పొక్కడంతో గత ప్రభుత్వ వైఖరిపై ఒక్కసారిగా వాదనలు మొదలైయ్యాయి. పదేళ్లుగా ప్రగతి భవన్ ని అడ్డాగా చేసుకొని తిరుగులేని ఆధిపత్యం చేలాయింసిన కెసిఆర్ ప్రభుత్వం తమ తప్పులను కప్పి పుచ్చుకునే క్రమంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనవసర అంశాలను తెరపైకి తీసుకువచ్చే తికమక పెటే ప్రయత్నాలు చేయడం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరిపి ఉంటే ఆ నిధులు సులువుగా రాష్ట్ర ఖజానాకు చేరేవని, వాటి వల్ల ఎంతో కొంత ఉద్యోగుల జీతాభత్యాల సమస్య పరిష్కారం అయ్యేదని అభిప్రాయ పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ప్రధాని మోడీని కలవడం, నిధులు వెంటనే విడుదల చేయాలని కోరడం శుభపరిణామని పలువురు కొనియాడుతున్నారు.