కొద్ది నెలల్లో జరగనున్న ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. వివిధ జిల్లాల్లోని 175 నియోజక వర్గాలకు జరిగే పోరులో ప్రధానంగా ఐదు రాజకీయ పక్షాలు తలపడనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, పై ఎత్తులు, సమీకరణలకు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయ రచ్చబండ వద్ద కొత్త తరహా చర్చలకు తెరలేపింది. జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అంధ్రలో ఒక్కసారిగా జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరిగి ఆ రాష్ట్రం పై దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో ఇటీవల ఘనవిజయాల పరంపరతో జోరు మీద ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉన్న క్యాడర్ ని తిరిగి తన వైపు తిప్పుకునే ప్రయత్నం ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని నేతలని, కార్యకర్తలను కలిగి ఉండేది. ఆయన మరణంతో వారంతా చెల్లాచెదురు అయిపోయారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయనే బలమైన నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రలో నాయకత్వం లేక కోల్పోయిన నేతలను, శ్రేణులను ఇప్పుడు తమవైపు రప్పించుకునే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. షర్మిలకు కండువా కప్పడం దీనికి సంకేతంగా చెప్పవచ్చు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఎన్నికల ఫలితాలపై ఆమె ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే విషయం పక్కన పెడితే ఆమె జగన్ ని ఏ మేరకు ఎదుర్కొని, పోరాడ గలదనేది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రాలో కాంగ్రెస్ ని బలోపేతం చేయాలంటే ముందుగా జగన్ సారథ్యంలోని వైసిపినీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలను కట్టడి చేయగలగాలి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు గట్టి క్యాడర్ ని కలిగి ఉన్నాయి.
రెండోసారి అధికారంలోకి రావడానికి అధికార వైసిపి పావులు కదుపుతోంది. ఇదే సమయంలో మరోసారి అధికారం చేజిక్కిచుకోవడానికి టిడిపి జనసేన తో చేతులు కలిపి దూసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో షర్మిలను సొంత అన్నపై కాంగ్రెస్ ఏ వ్యూహం రచించి ఎన్నికల చదరంలోకి పంపుతుందనేది ఆసక్తికర అంశం. మరోవైపు బిజెపి నుంచి పురందేశ్వరి వైసిపిని, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి. ఇక్కడ చంద్రబాబు విషయంలో పురందేశ్వరి ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారనుంది. అందుకే అన్నా చెల్లెళ్ళు, బావ, మరదలు మధ్య సాగే ఎన్నికల సమరం రేపు ఆంద్రప్రదేశ్ లో జరగనున్న ప్రచారంలో రసవత్తరంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.