తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మారిన బి.అర్.ఎస్.పార్టీ నేతలు కొద్ది రోజులుగా వ్యవహారిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) నేతలు గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వంపై మూకుమ్మడిగా చేసున్న పొంతన లేని వ్యాఖ్యలు అంతుపట్టకుండా ఉన్నాయి. తమ ప్రభుత్వ “ఒంటెత్తు” పోకడలు మూలంగానే గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే వాస్తవం తెలిసి కూడా తమ “ఓటమికి ప్రజలే కారణం” అనే రీతిలో బి.అర్.ఎస్. నేతలు ప్రవర్తించడం రాజకీయ పరిశీలకులను నివ్వెర పరుస్తోంది. బి.అర్.ఎస్. పార్టీ ఓటమికి కారణాలు ఏమిటనేది దాదాపు అన్ని జిల్లాల్లోని ఆ పార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా వివరిస్తూ వస్తున్నా కేటిఆర్, కవిత, హరీశ్ వంటి నేతలు ఆ విషయాలను పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడం సమస్యగా మారిందని కొందరు బి.అర్.ఎస్. నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బి.అర్.ఎస్.గా మార్చడం వల్లే ఓటమి పాలైనట్టు కడియం శ్రీహరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాత వారికే మళ్ళీ టిక్కెట్లు ఇవ్వడం కూడా కారణం అని మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. అంతే కాకుండా సంక్షేమ పథకాల అమలు తీరు సమర్థవంతంగా లేనందున ప్రభుత్వం పట్ల సామాన్య ప్రజలలో నమ్మకం సన్నగిల్లిందని మరికొందరు నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్ళారు. సొంత పార్టీ వారి నిర్వాకం వల్లే కొన్నిచోట్ల ఓడిపోవలసి వచ్చిందని పోచారం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హావాను అడ్డుకోలేక పోవడం కూడా ఓటమికి కారణం అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. బి.అర్.ఎస్.పార్టీ ఓటమికి అంతర్గతంగా ఉన్న ఇలాంటి అనేక అంశాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను జనం గుడ్డిగా నమ్మారని కెటిఆర్ పదేపదే చేస్తున్న ప్రకటనలు, ప్రచారం విమర్శలకు దారి తీస్తోంది. ఇదే సందర్భంలో గత పదేళ్లుగా కేసీఅర్ ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఏమేరకు నెరవేర్చిందో చెప్పాలనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం పరిపాలన పరమైన దిద్దుబాటు చర్యల్లో ఉంటే అవి తమ హయాంలో జరిగిన లోపాలను వెలికి తీయడానికే అన్నట్టు బి.అర్.ఎస్. నేతలు వ్యవహరించడం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. “ఒకరి నుంచి మరొకరు ఇల్లు కొనుగోలు చెస్తే ఆ ఇంటిని తమకు అనుకూలంగా తీర్చి దిద్దుకోవడం సహజం అనీ, అలాంటి ప్రయత్నమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని” బి.అర్.ఎస్. పార్టీకే చెందిన సీనియర్ నేత ఒకరు వెల్లడించడం గమనార్హం. అయితే, బి.అర్.ఎస్. నేతల ప్రవర్తన చూస్తుంటే గత ప్రభుత్వం ఎలా పని చేసిందో కొత్త ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగాలని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వాహనాల పై కేసీఅర్ బొమ్మలను తొలగిస్తున్నారని రాజకీయ అనుభవం ఉన్న హరీశ్ రావు వ్యాఖ్యానించడం పై కాంగ్రెస్ శ్రేణులు మండి పడుతున్నాయి. పదేళ్ల కిందట108 వాహనం పై ఉన్న రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలను ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను వంద రోజుల్లో అమలుచేస్తామని స్పష్టంగా చెప్పి, అధికారంలోకి రాగానే వాటిలో రెండింటిని ఆచరణలోకి తీసుకువచ్చిన విషయాన్ని బి.అర్.ఎస్. నేతలు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మిగతా హమీలను కూడా అమలులోకి తీసుకురావడానికి ఇంకా రెండు నెలల గడువు ఉందన్న విషయన్ని మరచిపోయి వాటిని అమలు చేయక పోతే “మెడలు వంచుతం, నిలదీస్తాం” అంటూ కెటిఆర్ వంటి నేత రెచ్చగొట్టే ప్రకటనలు చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కాళేశ్వరం డ్యామ్ సమస్య, విద్యుత్తు శాఖలో చెల్లింపులు, ధరణి పోర్టల్, టి.ఎస్.పి.ఎస్. సి., పార్ములా ఇ రద్దు తదితర అంశాల పై కొత్త ప్రభుత్వం చేపట్టిన విచారణ నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బి.అర్.ఎస్. నేతలు వ్యూహం ప్రకారం 6 గ్యారంటీ హామీలు, 420 వాగ్దానాలు అంటూ హడావిడి చేస్తున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ప్రజా సమస్యల పట్ల పోరాడడానికి తగినంత సంఖ్యా బలం ఉన్న బి.అర్.ఎస్. నేతలు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యూహ రచనలు చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. అలా చేయకపోతే అధికారం చేజారిందనే అక్కసుతోనే అధికార పక్షంపై విరుసుకు పడుతున్నారనే సందేశం జనంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.