తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగ తీరు జనం మధ్య అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరిపిన ఆదిలాబాద్ జిల్లా పర్యటన తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వేదిక నుంచి అయన గుప్పించిన మాటలు చర్చనీయాంశాలుగా మారాయి .రాష్త్ర పెద్దగా రేవంత్ వ్యవహార శైలి, లేవనెత్తిన అంశాలు, వెల్లడించిన హామీలు భవిష్యత్తును కళ్ళముందు చూపినట్టు ఉందనే ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం. ఇంద్రవెల్లిలో జరిగిన “తెలంగాణ పునర్నిర్మాణం” వేదిక పైనుంచి రేవంత్ విసిరిన ఒక్కొక్క వాఖ్యాన్ని పట్టణ వాసులతో పాటు అధికంగా గ్రామీణ ప్రజానీకం ఆసక్తిగా ఆలకించడం కనిపించింది.
“చవటలు, దద్దమ్మలు, మెడలు వంచుతం, పొట్టోడు, పొడుగోడు…”అంటూ అప్పటి ప్రగతి భవన్ నుంచి వినిపించిన గత ముఖ్యమంత్రి మాటలతో మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును పోల్చుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తానే ఈ రాష్ట్రానికి శాశ్వత నాయకున్ని అనే అపోహలో ప్రధానమంత్రి నుంచి సర్పంచి స్థాయి నాయకుల వరకు ఎవర్నీ లెక్క చేయకుండా బి.అర్.ఎస్. అగ్రనేతలు వ్యవహరించేవారని చర్చించుకోవడం ప్రత్యేకం. ఇంద్రవల్లి ప్రసంగంలో సందర్భానికి అనుగుణంగా తెలంగాణ జన పదాలు వాడుతూ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన విధానం సామన్యులకే కాదు, విద్యవేత్తలు, రాజకీయ పరిశీలకులను సైతం కట్టిపడేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు నెల రోజులుగా బి.అర్.ఎస్. నేతలు కె.టి.అర్., కవిత, హరీష్, కడియం శ్రీహరి వంటి నేతలు చేస్తున్న రకరకాల విమర్శలు,ఆరోపణలు, ఇరుకున పెట్టే వ్యూహాలను “తెలంగాణ పునర్నిర్మాణ” వేదిక నుంచి ముఖ్యమంత్రి ఘాటైన సమధానం చెప్పారని వివిధ పార్టీల నేతలు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. “కూలి పోవడానికి మాదేమీ కాళేశ్వరం ప్రాజెక్టు కాదు… కూలగొట్టే వాళ్లను గెలిపించిన వాళ్లు వేప చెట్టుకు వేలాడదీసి కొడతారు…” అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరినీ కట్టిపడేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందంటూ బి.అర్.ఎస్. నేతలు చేస్తున్న ప్రచారానికి రేవంత్ మాటలు చెంపపెట్టని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లకు, సమస్యలకు బారాస ప్రభుత్వమూ, కేసీఆర్ కుటుంబమే బాధ్యులు అంటూ అందుకు దారి తీసిన కారణాలను రేవంత్ ఉదహరించిన పద్ధతి ఆలోచింపజేసేదిగా ఉందంటున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని కొందరు టి.వి.లు, ఇతర సామాజిక మద్యమాల్లో పదేపదే విక్షిచినట్టు తెలుస్తోంది.రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆలకించిన కొందరు బారాస నేతలు, ఆ పార్టీ శ్రేణులు సైతం వ్యక్తిగతంగా “ఫిదా”కావడం కొసమెరుపు .