భూ కుంభకోణం కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ.డీ. అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు. 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు తేలింది. రికవరీ చేసిన వాట్సప్ చాట్‌లో ఈ విషయం వెల్లడైంది. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ అయిన సోరెన మిత్రుడు బినోద్ సింగ్ మధ్య జరిగిన వాట్సప్ మెసేజ్‌లో కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నడిచాయి. ఈ వాట్సప్ చాట్‌ను ఈడీ అధికారులు కోర్టులో సమర్పించారు. ఈ కీలక చాట్‌లో అధికారుల పేర్లు, వారికి ఎక్కడ పోస్టింగ్ కోరుకుంటున్నారో తెలుసుకొని అందుకు తగినట్లు లంచం డిమాండ్ చేసి పనులు జరుపుకున్నట్లు తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ ధ్రువ పత్రాలను తారుమారు చేసి సోరెన్ ప్రభుత్వం భూముల్ని అక్రమంగా సంపాదించిందని ఈ.డీ. వివరించింది. అంతటితో ఆగకుండా అధికారులను బదిలీ చేయడానికి లంచాలు తీసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడారని ఈడీ ఆరోపించింది. ఇదిలా ఉండగా, రాంచీ పీఎంఎల్‌ఏ కోర్టు సోరెన్‌కు ఈడీ రిమాండ్‌ను మరో 5 రోజులు పొడిగించింది. జార్ఖండ్‌లో భూ కుంభకోణం విచారణలో భాగంగా సోరెన్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.