24 అంటే 40-జనసేన “సినిమా” లెక్కలు…!

24 c

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉత్కంఠకు తెరపడింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో అక్కడున్న మొత్తం 175 నియోజక వర్గాలలో జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుంది. అదేవిధంగా మూడు లోక్ సబ్ నియోజక వర్గాలలో “సేన” అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. అయితే, ఇక్కడే “సైనికుల్లో” నిరాశ తలెత్తింది. అధికారమే లక్ష్యంగా, మార్పే ఊపిరిగా ఆవిర్భవించిన జనసేన ఇంత కాలం అదే దూకుడు చూపినట్టు కనిపించింది. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించి తప్పుచేశారు, ఈ సారి తనకు అవకాశం ఇవ్వండి, ముఖ్యమంత్రిని చేయండి.. అంటూ “సేన” అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో బహిరంగ ప్రసంగాలు కూడా చేశారు. కానీ, వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లకు మాత్రమే జనసేన పరిమితం  కావడంతో పలు నియోజక వర్గాలలోని మెజారిటీ “సైనికుల్లో’ గందరగోళ పరిస్థితి నెలకొంది.మొన్నటి వరకు  అధికార పార్టీ, దాని నేతల పై విరుసుకు పడ్డ పార్టీ అధినేత ఏ అంచనాలతో 24 నియోజక వర్గాలలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారో అంతుపట్టడం లేదని ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా ముందుకు వచ్చిన “సేన” తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ లోని కొందరు సీనియర్ నేతలకు మొదటి నుంచి నింగుడు పడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉభయ గోదావరి, కోస్తా ఆంధ్ర, పల్నాడు ప్రాంతాల్లో క్యాడర్ ను పెంచుకున్న జనసేన టిడిపితో జరిగిన ఒప్పందం వల్ల ఆ క్యాడర్ ని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

24 BABU PVAN

ప్రస్తుతం అధినేత నిర్ణయం నివురుగప్పిన నిప్పులా ఉందని పేర్కొంటున్నారు. బహుశా ఈ విషయాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్ సర్దుబాటు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోందని, ఇందులో భాగంగానే 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రం లోని 40 నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ లెక్కలతో విశ్లేషిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.  24 సీట్లేనా అనుకోవద్దని, జన సైనికులకు 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్ల సర్దుబాటు చేసుకున్నట్టు ప్రకటించడం సామాన్య కార్యకర్తలకు ఒక పట్టాన అర్ధం కావడం లేదు. అనేక మంది పెద్దలు, పార్టీ నేతలు 40 – 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తు చేస్తూ, గత ఎన్నికల్లో  ఓ పది సీట్లన్నా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమంటూ పవన్ చేసిన ప్రకటన సైతం అంతుపట్టకుండా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి, పోటీ చేసిన ప్రతి చోటా జనసేనను గెలిపించాలని పిలుపునివ్వడం కూడా క్రియాశీలకంగా ఉన్న నేతలకు ఒంటపట్టడం లేదు. నియోజక వర్గాలలో కింది స్థాయి కార్యకర్తలు, నేతలతో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో తమ నిర్ణయం వెల్లడించడానికి కొందరు సిద్దమవుతున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *