ఒకే రక్తం, ఒకటే గర్భం కానీ పుట్టిన బిడ్డలు మగ, అడ అదే తేడా. తల్లి “కడప” గడప దాటని గృహిణి. తండ్రిది దేశానికి ఏదో చేయాలనే తపన. అందుకే ఆయన తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నేతగా ఆధిపత్యాన్ని చాటారు. రాజకీయంగా ఆయన ఆశయం, దూర దృష్టి అమోఘం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో చేయాలనుకున్న ఆయన అకాల మరణం ఆ కుటుంబానికే కాదు తెలుగు ప్రజలకు, ఆయన్ని నమ్ముకున్న రాజకీయ పార్టీకి తీరని లోటు.

వైఎస్ఆర్ ఏ కక్షలు లేని రాయలసీమను కలగన్నారో అవే ఇప్పుడు భగ్గు మంటున్నాయి. ఆయన కడుపున పుట్టిన బిడ్డలే “సీమ” కక్షలకు ప్రత్యక్ష సాక్ష్యగా దర్శనం ఇస్తున్నారు. రాజకీయ వ్యత్యాసమో, కుటుంబ కలహాలో, ఆస్తి తగాదాలో వీటిలో ఏది కారణం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికి స్పష్టంగా తెలియదు. తో బుట్టువు పై ముఖ్యమంత్రి జగన్ విరుచుకు పడడం, సొంత అన్నపై షర్మిల ఎవరూ ఊహించని విధంగా విమర్శలు, ఆరోపణలతో దుమ్మెత్తి పోయడం, అతని అవినీతి భాగోతాలను రోడ్డుకు ఈడ్చడం అంతు పట్టని వ్యూహాలు. ఇప్పటి వరకు వివిధ పార్టీల రాజకీయ ప్రత్యర్ధులు సైతం దూషించుకోని స్థాయిలో అన్నా, చెల్లెళ్ళు విమర్శనాస్త్రాలు సంధించడం దేశ రాజకీయ చదరంగంలో ఇదే తొలిసారి. ప్రభుత్వ విధానాలను, పథకాలను, వాటి అమలు తీరును ప్రశ్నించడం వేరు. కానీ, ప్రస్తుతం జగన్ అక్రమాల పైనే షర్మిల ప్రచారం చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
సొంత చెల్లెలై ఉండి అన్న అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం రాజకీయమా లేక వ్యక్తిగత ప్రయోజనమా అనేది రాజకీయ పరిశీలకులను సైతం విస్మయ పరుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అతిరథ మహారథులను ఎదుర్కొని, తిరుగులేని నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా అనేక ప్రజాకర్షక పథకాలతో “జననేత”గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డలు జగన్, షర్మిల రాజకీయ వ్యవహార శైలిని దేశ రాజకీయ చదరంగంలో విభిన్నగా ఉండడం గమనార్హం. కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య రాజుకుంటున్న రాజకీయ వైరుధ్యం కన్నతల్లినీ ఇబ్బందుల్లో పడేసింది.

తల్లడిల్లిన “తల్లి” మనస్సు…!
ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి స్మృతి చిహ్నం సాక్షిగా అన్నా,చెల్లెళ్ళు ఎన్నికల శంఖారావం పూరించడం, ప్రచారంలో అడ్డూఅదుపూ లేని విమర్శనల బాణాలు విసురు కోవడం తల్లి పేగుకు తట్టుకోలేక పోయింది. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూతురి సరసన నిలబడి “నా బిడ్డను ఆశీర్వదించండి” అని అడిగిన విజయమ్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ప్రచార తెరపై కనిపించకుండా పోయారు.

అన్నా,చెల్లెళ్ల మధ్య రగులుతున్న మాటల మంటల వేడికి విజయమ్మ మనస్సు కమిలి పోయినట్టు తెలుస్తోంది. ఆమె ఏకంగా దేశం ఎల్లలు దాటి అమెరికా వెళ్ళి పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? కుమారుడు మళ్లీ రావాలనా? కుమార్తె పంతం నెగ్గాలనా? ఎందుకు విజయమ్మ అమెరికా పయనం పట్టారు? ఇదే అంశాన్ని దేశ వ్యాప్తంగా రాజకీయ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొన్నటి వరకు షర్మిల వెంట ఉన్న విజయమ్మ అకస్మాత్తుగా అమెరికా వెళ్ళాల్సిన అవసరం వెనుక ఆంతర్యం తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల సమరం ముగిస్తే గానీ కుటుంబ వ్యవహారం అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.