తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి అంతుపట్ట కుండా ఉంది. అంధ్రప్రదేశ్ లో చేతులు కలిపిన ఆ మూడు పార్టీలు తెలంగాణాలో మాత్రం విడి పోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నానా హంగామా చేసిన జనసేన పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పతా లేకుండా పోయింది. అప్పట్లో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయంతో జనసేన ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికలకు నెల రోజుల ముందే పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు మొదట ప్రకటించిన జనసేన ఆ తర్వాత బిజెపితో చేతులు కలిపి చివరకు 8 చోట్ల మాత్రమే పోటీకి సిద్ధపడింది. కానీ, ఆ ఫలితాల్లో ఏ ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ దక్కించుకో లేక పోయారు. పవన్ కళ్యాణ్ అభిమానుల పుణ్యాన మూడు, నాలుగు వేల ఓట్లకే పరిమితం అయ్యారు.

తెలంగాణా లోనూ వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు పార్టీల పొత్తు వ్యవహారం చర్చకే రావడం లేదు. అంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి టిడిపి, భాజపా, జనసేనలు ఒక్కటయ్యాయి. జగన్ ని గద్దె దించాలని టిడిపి, జనసేన కంకణం కట్టుకుంటే, అదే అదునుగా అక్కడి 25 లోక్ సభ సీట్లతో ఎంతో కొంత లబ్ధి పొందాలని భాజపా ఆశిస్తోంది. అయితే, తెలుగు ప్రజల మరో రాష్ట్రమైన తెలంగాణాలో జరిగే ఎన్నికల విషయంలో మాత్రం ఆయా పార్టీల ఎత్తులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అనేక నియోజక వర్గాలలో బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఉన్న ఉన్న పరిస్థితుల వల్ల నవంబర్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో టిడిపి పూర్తిగా చేతులెత్తేసింది. షర్మిల నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏకంగా పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ సరసన చేరింది. ఇక ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాలు దువ్విన జనసేన చివరికి భాజపాతో చేయి కలిపింది చేదు అనుభవాన్నిచవి చూసింది.

ఆంధ్రప్రదేశ్ లో మూడు జండాలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఈ మూడు పార్టీలు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో ఎందుకు కలిసి పోటీకి దిగడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న నియోజక వర్గాల పై కూడా ఈ మూడు పార్టీల నేతలు ఎందుకు దృష్టి సారించడం లేదనేది ప్రశ్న. అయితే, తెలంగాణా పార్లమెంట్ స్థానాల్లో ప్రస్తుతానికి బిజెపి ఒంటరిగానే రంగంలోకి దిగుతోంది. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి ఎలాంటి ఉలుకు, పలుకు లేదు. అసలు పవన్ కళ్యాణ్ నుంచి గానీ, చంద్రబాబు నుంచి గానీ, పురంధేశ్వరి, కిషన్ రెడ్డిల వైపు నుంచి గానీ తెలంగాణాలో పొత్తుల విషయమై ఏ ఒక్క ప్రకటన రాకపోవడం గమనార్హం. కనీసం భాజపా అభ్యర్ధుల తరఫున ప్రచారం చేయడానికి చందరాబు, పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారా అనేది ఆసక్తికర చర్చగా మారింది.
